Samsung: రూ.13 వేలకే శామ్ సంగ్ నుంచి 5జీ ఫోన్
- గెలాక్సీ ఎఫ్ 14 5జీ ఫోన్ విడుదల
- ఈ నెల 30 నుంచి ఫ్లిప్ కార్ట్, శామ్ సంగ్ పోర్టల్ లో విక్రయాలు
- ఆరంభ డిస్కౌంట్ కింద రూ.1,500
- 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా
ప్రముఖ కొరియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్ సంగ్ భారత వినియోగదారుల కోసం 5జీ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరకే తీసుకొచ్చింది. గెలాక్సీ ఎఫ్ 14 5జీని విడుదల చేసింది. తక్కువ ధరలో అందుబాటులో ఉన్న 5జీ ఫోన్లతో పోలిస్తే ఇది మెరుగైన ఆప్షన్ కానుంది.
ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్, శామ్ సంగ్ డాట్ కామ్ పోర్టల్ నుంచి దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర నిజానికి రూ.14,490. దీనిపై రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. నికర ధర రూ.12,990 అవుతుంది. అలాగే, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ.15,990. దీనిపైనా రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. దీంతో రూ.14,490కి సొంతం చేసుకోవచ్చు. ఓఎంజీ బ్లాక్, గోట్ గ్రీన్, బీఏఈ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. ఈ నెల 30 నుంచి ఫ్లిప్ కార్ట్, శామ్ సంగ్ స్టోర్ లో అమ్మకాలు ఆరంభమవుతాయి.
ఈ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెడ్ డీ డిస్ ప్లే, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ వెర్షన్ల అప్ డేట్ లభిస్తుంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది. 25 వాట్ చార్జర్ తో చార్జ్ చేసుకోవచ్చు. కానీ ఫోన్ తో పాటు చార్జర్ ఇవ్వడం లేదు. దీన్ని రూ.1,149 పెట్టి కొనుగోలు చేసుకోవాలి. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా ఉంది. అలాగే, 2 మెగాపిక్సల్ సెన్సార్ కూడా ఉంటుంది. ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా అమర్చారు.