TB: మన దేశంలో ఎక్కువ మందికి టీబీ ముప్పు.. నివారణే పరిష్కారం
- సాకారం కాని సంపూర్ణ నిర్మూలన లక్ష్యం
- మొదటి రెండు వారాల్లో రోగి నుంచి ఇతరులకు వ్యాప్తి
- దీర్ఘకాలం పాటు ఔషధాలు తీసుకోవాల్సిన పరిస్థితి
- ముఖానికి మాస్క్ ధరించడం, దూరం పాటించడమే మార్గం
మన దేశంలో ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ/క్షయ) కొరకరాని కొయ్య మాదిరిగా తయారైంది. సంపూర్ణ టీబీ రహిత దేశంగా అవతరించాలన్న కేంద్ర సర్కారు లక్ష్యం ఆచరణలో నెరవేరడం లేదు సరికదా, మన దేశంలో పెద్ద సంఖ్యలో ఏటా టీబీ బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలను పరిశీలిస్తే.. 2021లో భారత్ లో ప్రతి లక్ష మందికి 188 మంది టీబీ బారిన పడ్డారు. నేడు వరల్డ్ ట్యూబర్ క్యులోసిస్ డే. కనుక ఈ మహమ్మారి గురించి అవగాహన ఎంతో ముఖ్యం.
టీబీ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మందికి వ్యాపిస్తున్న శ్వాసకోస ఇన్ఫెక్షన్. గురుగ్రామ్ లోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్, పల్మనరీ మెడిసిన్ విభాగం డాక్టర్ పుంజన్ పారిఖ్ వివరణ ప్రకారం.. మన దేశంలో 40 శాతం మంది టీబీ బారిన పడగా, అందులో కేవలం 10 శాతం మంది మాత్రమే ఇబ్బంది పడ్డారు. బలమైన వ్యాధి నిరోధక శక్తి ఉన్న వారిని ఇది ఏమీ చేయలేదని ఆయన చెప్పారు.
టీబీ అంటే..?
మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల టీబీ వ్యాధి వస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే బ్యాక్టీరియా. వ్యాధి కారక బ్యాక్టీరియా ఒకరి శ్వాస వ్యవస్థ నుంచి విడుదలై గాలి ద్వారా మరొకరి శ్వాస వ్యవస్థలోకి చేరుతుంది. టీబీ బారిన పడిన రెండు వారాల్లో వారి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందే రిస్క్ ఎక్కువ. రెండు వారాల తర్వాత ఇతరులకు వ్యాపించే బలం బ్యాక్టీరియాకు తగ్గిపోతుంది. దీని బారిన పడి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే చికిత్స తీసుకోవాలి. లేదంటే ఊపిరితిత్తులు దెబ్బతిని మరణానికి దారితీయవచ్చు.
లక్షణాలు
తక్కువ మోతాదులో జ్వరం. అది కూడా సాయంత్రం సమయంలో కనిపిస్తుంది. బరువు తగ్గుతారు. ఆకలి తగ్గిపోతుంది. రాత్రి సమయంలో చెమటలు పడుతుంటాయి. అలసట కనిపిస్తుంది. ఇవన్నీ సాధారణ లక్షణాలు. విడవని దగ్గుతో బాధపడుతుంటారు. అంటే ఈ బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో సమస్యకు కారణమవుతుందన్న దానికి సంకేతం. దగ్గు రెండు వారాలకు పైగా కొనసాగుతుంది. దగ్గినప్పుడు కొన్ని సందర్భాల్లో రక్తం పడొచ్చు. ఛాతీలో నొప్పి కనిపిస్తుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇవన్నీ శ్వాస వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు.
వ్యాధి నిర్ధారణ
వైద్యుల వద్దకు వెళితే రక్త పరీక్షలు, ఎక్స్ రే, కళ్లె పరీక్ష ద్వారా గుర్తిస్తారు. అవసరమనుకుంటే సీటీ స్కాన్, బ్రాంకోస్కోపీ పరీక్షలు కూడా చేయవచ్చు.
చికిత్స
టీబీ అని నిర్ధారణ అయితే చాలా రోజుల పాటు ఔషధాలు తీసుకోవాల్సి ఉంటుంది. తీవ్రమైన కేసుల్లో 18-24 నెలల పాటు కూడా కోర్స్ వాడాల్సి వస్తుంది. ఎక్కువ కేసుల్లో 14-45 రోజలు పాటు కోర్స్ ఉంటుంది. ఎంతకాలం పాటు అన్నది వైద్యులు సిఫారసు చేస్తారు. చిన్న పిల్లలకు బీసీజీ టీకా వేయిస్తే టీబీ ముప్పు చాలా తగ్గిపోతుంది. టీబీ బ్యాక్టీరియా శరీరంలోకి చేరినా పెద్ద సమస్యలు కనిపించవు.
నివారణ
మన దేశంలో అవగాహన లేమి టీబీ నిర్మూలనకు అవరోధంగా ఉంటోంది. వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నా చాలా మందికి అవగాహన లేక వైద్యుల వద్దకు వెంటనే వెళ్లడం లేదు. దీంతో ఇది మరింత మందికి వ్యాప్తి చెండానికి కారణమవుతోంది. ఈ బ్యాక్టీరియా కొన్ని రకాల ఔషధాలకు నిరోధాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం, ముఖానికి మంచి ప్రొటెక్షన్ తో కూడిన మాస్క్ ధరించడం అవసరం. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. ప్రజలకు దగ్గరగా కాకుండా కొంత దూరం పాటించడం మంచిది.