Polavaram Project: పోలవరం ఎత్తు, నిల్వ ప్రస్తుతానికి అంతే.. పార్లమెంటులో కేంద్రం ప్రకటన!
- పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమన్న కేంద్రం
- వైసీపీ ఎంపీ సత్యవతి ప్రశ్నకు బదులిచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్
- ఏపీ ప్రభుత్వం 11,677 కుటుంబాలకే పునరావాసం కల్పించిందని వ్యాఖ్య
- నిర్వాసిత కుటుంబాల పునరావాసంలో జాప్యం జరిగిందని వెల్లడి
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం చేసింది. అంత మేరకే నీటిని నిల్వ చేయనున్నట్లు తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం కూడా అంత వరకేనని చెప్పింది.
ఈ రోజు లోక్ సభ లో వైసీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘‘తొలిదశ సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023కే పూర్తి కావాల్సి ఉంది. 20,946 నిర్వాసిత కుటుంబాలకు సహాయం, పునరావాసం ఫిబ్రవరి 2023 నాటికే కల్పించాల్సి ఉంది. అవి ఇంకా పూర్తి చేయలేదు’’ అని వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం ఇప్పటిదాకా కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయం, పునరావాసాన్ని కల్పించిందని ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. సహాయ, పునరావాసాలు ఈ ఏడాది మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉన్నా.. అందులో జాప్యం జరిగిందని వివరించారు.