YS Jagan: సీఎం జగన్ నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు
- నేటి నుంచి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
- తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా సీఎం ఇంట సంబరాలు
- అందంగా ముస్తాబైన గోశాల
- పంచాంగ శ్రవణానికి సతీసమేతంగా హాజరైన సీఎం జగన్
నేడు తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ శోభ వెల్లివిరుస్తోంది. తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఉట్టిపడేలా ఉగాది సంబరాలు జరిపారు. సీఎం జగన్ నివాసంలోని గోశాలను అందంగా ముస్తాబు చేశారు. గోశాలలో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా పలు సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు. తిరుమల ఆనంద నిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేయడం ఆకట్టుకుంది.
ఉగాది నేపథ్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించగా, సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. సీఎం దంపతులు సంప్రదాయ దుస్తులు ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. సీఎం దంపతులకు టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. జగన్, వైఎస్ భారతి ఈ సందర్భంగా ఉగాది పచ్చడిని స్వీకరించారు.
జగన్ తన అర్ధాంగి భారతికి నుదుటన తిలకం దిద్దగా.... జగన్ కు భారతి తిలకం దిద్దారు. ఉగాది వేడుకలకు ముందు సీఎం జగన్ దంపతులు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం నివాసంలో ఉగాది సంబరాలకు మంత్రి రోజా, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.