Starbucks: స్టార్‌బక్స్ సీఈఓగా భారత సంతతి వ్యక్తి
- స్టార్‌బక్స్ పగ్గాలు చేపట్టిన లక్ష్మణ్ నరసింహన్
- రిటైల్ రంగంలో లక్ష్మణ్‌కు విశేష అనుభవం
- గతంలో పెప్సికో, రెక్కిట్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసిన నరసింహన్
అంతర్జాతీయ కాఫీ చైయిన్ స్టార్‌బక్స్ పగ్గాలను ఓ భారత సంతతి వ్యక్తి చేపట్టారు. లక్ష్మణ్ నరసింహన్ సంస్థ సీఈఓగా బాధ్యతలను స్వీకరించినట్టు స్టార్‌బక్స్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో చేరినట్టు కూడా పేర్కొంది. ప్రస్తుతం తాత్కాలిక సీఈఓ హార్వర్డ్ షల్జ్ నుంచి ఆయన పగ్గాలను తీసుకున్నారు. సంస్థ ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించిన షల్జ్ గతేడాది స్టార్‌బక్ష్ బాధ్యతలు చేపట్టారు. కంపెనీకి కొత్త సీఈఓను ఎంపిక చేసేవరకూ సీఈఓగా కొనసాగారు.
ఎవరీ నరసింహన్..
నరసింహన్ పూణె యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టాపొందారు. ఆ తరువాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి జర్మన్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో మాస్టర్స్ చేశారు. రిటైల్ రంగంలో ఆయన 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గడించారు. పెప్సీకో, రెక్కిట్ వంటి కన్జూమర్ గూడ్స్ సంస్థల్లో కీలక స్థానాల్లో సేవలందించారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆయన స్టార్‌బక్స్‌లో చేరారు. మార్చి 20న సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు హావర్డ్ షల్జ్‌కు లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు.