SpiceJet: ఇద్దరు పైలట్లు ఒకే ఫుడ్ తినకూడదు..!
- ఎయిర్ లైన్స్ సంస్థలు అనుసరిస్తున్న విధానం
- ఒక్కటే ఆహారం తీసుకుంటే ఇద్దరూ అనారోగ్యం బారిన పడొచ్చు
- అప్పుడు విమానంలోని ప్రయాణికులకు రిస్క్
- దీన్ని పాటించకుండా చిక్కుల్లో పడ్డ స్పైస్ జెట్ పైలట్లు
స్పైస్ జెట్ పైలట్లు చేసిన ఒక పని.. ఈ విషయమై చాలా మందికి అవగాహనకు దారితీసేలా చేసింది. విమానం కాక్ పిట్ లో కాఫీ కప్పు పెట్డడం, ఇద్దరు పైలట్లు కలసి గుజియా అనే ఒకే రకమైన ఆహారాన్ని తీసుకున్న ఫొటోలు బయటకు వచ్చాయి. మార్చి 8న ఇది జరిగింది. దీంతో స్పైస్ జెట్ యంత్రాంగం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఆ ఇద్దరు పైలట్లకు విధులు కేటాయించకుండా హోల్డ్ లో పెట్టి, విచారణ ప్రారంభించింది. తప్పు తేలితే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
విమానం కాక్ పిట్ లోపల ఆహారం తీసుకోకూడదనే కఠిన నిబంధనను స్పైస్ జెట్ అనుసరిస్తోంది. విమానం క్రూ సిబ్బంది అంతా దీనికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే విమానంలో కాఫీ కప్పు ఒలికిపోతే అది షార్ట్ సర్క్యూట్ కు, అగ్ని ప్రమాదానికి దారితీయవచ్చు.
ఒకే ఆహారం తీసుకోకూడదు
కమర్షియల్ పైలట్లు ఇద్దరూ ఒకే ఆహారాన్ని తీసుకోకూడదనే నిబంధనను దాదాపు అన్ని విమానయాన సంస్థలు పాటిస్తున్నాయి. పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు లేవు కానీ, ఎయిర్ లైన్స్ సంస్థలు స్వచ్చందంగా అమలు చేస్తున్నాయి. అంటే ఒక విమానంలోని పైలట్, కో పైలట్ ఒక్కటే మీల్స్ లేదా స్నాక్స్, లేదా మరే ఇతర ఆహారాన్ని తినకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా ఆహారం కలుషితం అయితే ఇద్దరు పైలట్లూ అనారోగ్యానికి గురికావచ్చు. అప్పుడు విమానంలోని ప్రయాణికులకు ముప్పు ఏర్పడుతుంది. కనుక పైలట్లు వేర్వేరు ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. ఒకరు అనారోగ్యం బారిన పడినా, మరొకరు సురక్షితంగా విమానాన్ని నడపడానికి ఉంటుంది.