Rajamouli: 'ఆర్ ఆర్ ఆర్' నిర్మాణంలో చిరంజీవి భాగస్వామి అనే టాక్ .. స్పందించిన డీవీవీ దానయ్య!

DVV Danayya Interview

  • 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి నిర్మాతగా ఉన్న దానయ్య  
  • 'ఆస్కార్' వేడుకకి వెళ్లకపోవడానికి కారణం చెప్పిన నిర్మాత 
  • ఈ సినిమా నిర్మాణంతో మెగాస్టార్ కి సంబంధం లేదని వెల్లడి 
  • ఆయన హీరోగా ఒక సినిమా చేయనున్నట్టు చెప్పిన దానయ్య


'ఆర్ ఆర్ ఆర్' సినిమాను భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇటీవల ఆస్కార్ వేదికపై సందడి చేసింది. ఈ వేదికపై రాజమౌళి .. ఎన్టీఆర్ .. చరణ్ .. కీరవాణి .. అలా అంతా సందడి చేశారు .. కానీ నిర్మాత డీవీవీ దానయ్య ఎక్కడా కనిపించలేదు. ఆయన పేరు ఎక్కడా ప్రస్తావనకి రాలేదు. దాంతో అనేక రకాల ఊహాగానాలు షికారు చేశాయి. 

ఈ నేపథ్యంలో 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దానయ్య మాట్లాడుతూ .. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలోని పాటకి ఆస్కార్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పురస్కారం సమయంలో నన్ను ఫోకస్ లోకి రానీయలేదు .. పక్కన పెట్టేశారు .. దగ్గరికి రానీయలేదు .. అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. మొదటి నుంచి కూడా నేను పబ్లిసిటీకి దూరం .. అందువలన మీడియా ముందుకు రాలేదు అంతే" అన్నారు. 

ఇక ఈ సినిమాకి చిరంజీవి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారనే విషయంపై దానయ్య స్పందిస్తూ .. "నేను నిర్మించే సినిమాలో చిరంజీవిగారు ఎందుకు పెట్టుబడులు పెడతారు? ఆయన బ్యానర్ పై ఆయన సినిమాలు చేసుకోగలరు. ఈ సినిమా నిర్మాణం పరంగా చిరంజీవిగారికి ఎలాంటి సంబంధం లేదు .. ఈ ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. త్వరలో చిరంజీవి గారు హీరోగా ఒక సినిమా చేయనున్నాను. అందుకు సంబంధించిన పనుల్లోనే ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News