Stock Market: లాభాల బాటలో సెన్సెక్స్.!.

stock market indices start on a positive note

  • అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో సూచీలు లాభాల బాట
  • సెన్సెక్స్@57,814, నిఫ్టీ@17,040 
  • అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ నివారణ చర్యలపై మదుపర్లలో ఆశలు

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.00 గంటల సమయంలో సెన్సెక్స్ 183 పాయింట్ల లాభంతో 57,814 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ కూడా 52 పాయింట్లు లాభపడి 17,040 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.54 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ సూచీల్లోని నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్‌లండ్‌టీ, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయితే.. పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా మాత్రం నష్టాలను చవిచూస్తున్నాయి.  

సోమవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగ సంక్షోభాన్ని నివారించేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. ఇక అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ నేడు సమావేశం కానుంది. వడ్డీ రేట్ల పెంపుపై చర్చించనుంది. ఇందుకు సంబంధించి బుధవారం తుది నిర్ణయం వెలువడుతుంది. వడ్డీ రేట్లు పెరిగిన పక్షంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు కూడా పుంజుకున్నాయి. ఇటీవల 15 నెలల కనిష్ఠానికి పడిపోయిన సూచీలు సోమవారం క్రమంగా పెరిగాయి.  ఇక ఆదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇండియన్ ఆయిల్, ఎన్‌టీపీసీ, స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ తదితర కంపెనీల షేర్లను ఈరోజు జాగ్రత్తగా గమనిస్తుండాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News