Cheating: వీడియోకి లైకులు కొడితే డబ్బులిస్తాం అంటూ రూ.2 లక్షలకు టోకరా

Fraudsters cheats woman

  • అహ్మదాబాద్ కు చెందిన మహిళకు టోపీ వేసిన మోసగాళ్లు
  • టెలికాం సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు
  • వాట్సాప్ సందేశం చూసి వలలో పడిన వైనం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా లేకపోతే ఖాతాలు ఖాళీ అవుతాయి. అహ్మదాబాద్ లో ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వీడియోలకు లైకులు కొడితే డబ్బులు వస్తాయని నమ్మిన ఆ మహిళ రూ.2 లక్షల వరకు పోగొట్టుకుంది. 

అహ్మదాబాద్ లోని ఘుమా ప్రాంతంలో నివసించే 38 ఏళ్ల రచనా భవ్సార్ ఓ టెలికాం సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు గత డిసెంబరు 8న జరా అనే యువతి పరిచయం అయింది. పార్ట్ టైమ్ జాబ్ కావాలా? అంటూ రచనా భవ్సార్ కు వాట్సాప్ లో మెసేజ్ చేసింది. జరా పంపిన ఆ మెసేజ్ కు రచనా స్పందించింది. తనకు పార్ట్ టైమ్ జాబ్ కావాలని జరాకు తెలిపింది. దాంతో, మీ వివరాలను మరికొందరికి పంపిస్తానని, వారు మరింత సమాచారం ఇస్తారని జరా... రచనాతో నమ్మబలికింది. 

ఆ తర్వాత మరో నెంబరు నుంచి రచనా ఫోన్ కు మెసేజ్ వచ్చింది. యూట్యూబ్ లో కొన్ని వీడియోలకు లైకులు కొట్టాలని, కొన్ని యూట్యూబ్ చానళ్లను, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ను  సబ్ స్క్రైబ్ చేసుకోవాలని ఆ కొత్త వ్యక్తి సూచించడంతో, రచనా వారు చెప్పినట్టే చేసింది. 

అనంతరం ఆమెను ఓ టెలిగ్రాం చానల్ కు లింక్ చేశారు. ఆమెకు వీడియోలు పంపించేవారు. వారు చెప్పిన విధంగా ఆ వీడియోలు లైక్ చేసి, సబ్ స్క్రైబ్ చేసి, స్క్రీన్ షాట్లను వారు సూచించిన గ్రూప్ కు పంపేది. మొదట్లో మూడ్నాలుగు లైకులకు రూ.150 వరకు ఇచ్చేవారు. 

ఆ తర్వాత మరింత ఎక్కువ పేమెంట్ కోసం రూ.10 వేలు డిపాజిట్ చేయాలని చెప్పగా, ఆమె అలాగే చెల్లించింది. ఆపై, పలు దఫాలుగా వారు చెప్పినట్టే చెల్లించింది. కానీ, అవతలి వ్యక్తుల నుంచి ఆమెకు ఎలాంటి పేమెంట్ అందలేదు. దాంతో తాను మోసపోయానని గ్రహించింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News