Millet Man: ‘మిల్లెట్ మ్యాన్’ పీవీ సతీశ్ కుమార్ కన్నుమూత

Millet Man PV Satheesh Dies

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సతీశ్
  • 1985లో జహీరాబాద్‌లో డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ ఏర్పాటు
  • చిరుధాన్యాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సతీశ్
  • పస్తాపూర్‌లో నేడు అంత్యక్రియలు

‘మిల్లెట్ మ్యాన్’గా తెలుగు ప్రజలకు చిరపరిచితమైన పీవీ సతీశ్ కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన సతీశ్.. 20 సంవత్సరాలపాటు దూరదర్శన్‌లో కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడిగా పనిచేశారు. 1970లో నాసా, ఇస్రో కలిసి నిర్వహించిన ‘శాటిలైట్  ఇన్‌స్ట్రక్షనల్ టెలివిజన్’ (సైట్) ప్రయోగంలో ముఖ్య పాత్ర పోషించారు. 

ఆ తర్వాత కొందరు మిత్రులతో కలిసి 1985లో జహీరాబాద్ సమీపంలోని పస్తాపూర్‌లో డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) స్థాపించారు. అక్కడ బడుగు వ్యవసాయ, రైతు కూలీ మహిళలను ప్రకృతి సేద్యం దిశగా ప్రోత్సహించారు. 75 గ్రామాల్లోని దాదాపు 5 వేల మందికిపైగా డీడీఎస్‌లో సభ్యులుగా ఉన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను 2019లో ఐరాస డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఈక్వేటర్ ప్రైజ్, ప్రిన్స్ ఆల్బర్ట్- మొనాకో ఫౌండేషన్ అవార్డు వంటి అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. 

చిరుధాన్యాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతోపాటు జహీరాబాద్‌కు ప్రత్యేక గౌరవం దక్కేలా చేశారు. అంతేకాదు, డీడీఎస్ మహిళా రైతు సంఘాల నిర్వహణలో దేశంలోనే తొలిసారిగా ‘సంఘం రేడియో’ను ప్రారంభించారు. కమ్యూనిటీ మీడియా ట్రస్ట్ ద్వారా గ్రామీణ మహిళలను డాక్యుమెంటరీ, లఘుచిత్రాల రూపకర్తలుగా తీర్చిదిద్దారు.

జన్యుమార్పిడి విత్తనాలు, రసాయన ఎరువుల వాడకాన్ని నిరోధించడం ద్వారా కొన్ని వందల కుటుంబాలను ప్రకృతి సేద్యం వైపు నడిపించారు. ఆయన మరణం బాధాకరమని వ్యవసాయ శాస్త్రవేత్త జీవీ రామాంజనేయులు, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. వివాహానికి దూరంగా ఉండి తన జీవితాన్ని గ్రామీణాభివృద్ధికి అంకితం చేసిన సతీశ్ అంత్యక్రియలు నేటి ఉదయం 11 గంటలకు పస్తాపూర్‌లో జరగనున్నాయి.

Millet Man
PV Satheesh
Deccan Development Society
Pastapur village
Zaheerabad
  • Loading...

More Telugu News