BTech Ravi: వైసీపీ అభ్యర్థులకు ఓటేసిన పట్టభద్రులను సజ్జల పట్టించుకోరా?: బీటెక్ రవి
- వై నాట్ పులివెందుల అంటూ బీటెక్ రవి వ్యాఖ్యలు
- పట్టభద్రులు తమవైపే ఉన్నారని వెల్లడి
- 2024లోనూ టీడీపీదే విజయమని స్పష్టీకరణ
- పులివెందులలో జగన్ ఓటమి ఖాయమన్న బీటెక్ రవి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బీటెక్ రవి స్పందించారు. వైసీపీ అభ్యర్థులకు ఓటేసిన పట్టభద్రులను కూడా సజ్జల పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత వై నాట్ పులివెందుల అంటున్నామని బీటెక్ రవి స్పష్టం చేశారు. 86 శాతం కుటుంబాలకు లబ్ది చేకూర్చామని సీఎం జగన్ చెప్పారని, 86 శాతం కుటుంబాల వారే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించారని తెలిపారు. ఏదేమైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని బీటెక్ రవి అన్నారు.
2024లో టీడీపీదే విజయమని స్పష్టం చేశారు. గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వంటి మహామహులు కూడా ఓటమి ఎదుర్కొన్నారని, జగన్ కూడా ఓడిపోతాడని తెలిపారు. పులివెందులలో పట్టభద్రులు టీడీపీ వైపే ఉన్నారన్న విషయం స్పష్టమైందని, వారికి మరింత అనుకూల వాతారణం కల్పిస్తే, వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమని బీటెక్ రవి అన్నారు.