Revanth Reddy: లీకేజి వ్యవహారం అంతా కేటీఆర్ ఆఫీసు నుంచే నడిచింది: రేవంత్ రెడ్డి

Revanth Reddy slams BRS govt on question paper leakage

  • తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజి
  • నిందితుడు రాజశేఖర్ కు కేటీఆర్ పీఏతో సంబంధం ఉందన్న రేవంత్
  • ఇద్దరివి పక్క పక్క గ్రామాలేనని వెల్లడి
  • గ్రూప్-1లో 100 మార్కులు దాటిన వారిని విచారించాలని డిమాండ్

టీఎస్ పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. విపక్షాలు అధికార బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. లీకేజి వ్యవహారం మొత్తం మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచే నడిచిందని ఆరోపించారు. 

గ్రూప్-1 లీకేజిలో కేటీఆర్ పీఏది కీలక పాత్ర అని, లీకేజి కేసులో నిందితుడు రాజశేఖర్ రెడ్డికి, కేటీఆర్ పీఏకి సంబంధం ఉందని తెలిపారు. ఇద్దరివీ పక్క పక్క గ్రామాలేనని రేవంత్ రెడ్డి వివరించారు. పీఏ చెబితేనే రాజశేఖర్ రెడ్డికి కేటీఆర్ ఉద్యోగమిచ్చారని తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 100 మార్కులు దాటిన వారిని విచారించాలని డిమాండ్ చేశారు. 

2016లో జరిగిన గ్రూప్-1 పరీక్షలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని, అమెరికా నుంచి నేరుగా వచ్చిన అమ్మాయి గ్రూప్-1 రాస్తే ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ పరీక్షలో టీఎస్ పీఎస్సీ ఉద్యోగికి 4వ ర్యాంక్ వచ్చిందని అన్నారు. వారిద్దరూ ఉద్యోగాలు పొందడం వెనుక ఎవరున్నారో తేలాలని డిమాండ్ చేశారు. 

టీఎస్ పీఎస్సీలో పనిచేసే ఉద్యోగులకు పరీక్షలు రాసే అర్హత లేనప్పుడు, 20 మంది ఉద్యోగులు ఎలా పరీక్ష రాశారని రేవంత్ ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy
Question Paper
Leak
Congress
BRS
TSPSC
Telangana
  • Loading...

More Telugu News