Gudivada Amarnath: ఏపీకి అంబానీ, అదానీ వస్తే టీడీపీకి ఎందుకు బాధ?: గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath fires on TDP

  • గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)పై అసెంబ్లీలో చర్చ
  • రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న మంత్రి అమర్నాథ్
  • రాష్ట్రానికి అగ్ర పారిశ్రామికవేత్తలు వస్తే ప్రతిపక్షం ఓర్వలేకపోతోందని విమర్శ

ఏపీకి పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీ వస్తే టీడీపీకి ఎందుకు బాధ? అని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. జీఐఎస్ ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 

25 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారని ఆయన చెప్పారు. అనేక రంగాల్లో ఎంవోయూలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించే రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని వివరించారు.

‘‘రాష్ట్రానికి అగ్ర పారిశ్రామిక వేత్తలు వస్తే ప్రతిపక్షం ఓర్వలేకపోతోంది. ఏపీకి అంబానీ, అదానీ వస్తే టీడీపీకి బాధేంటో అర్థం కావట్లేదు. ఏపీకి పెట్టుబడులు రావడం టీడీపీకి ఇష్టం లేదు’’ అని ఆరోపించారు. సీఎం జగన్ బ్రాండ్ చూసి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ పాలనపై పారిశ్రామికవేత్తలకు విశ్వాసం ఉందని అన్నారు.

More Telugu News