Cars: భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కార్లు ఇవే!

Hatchback cars sales in India

  • భారత మార్కెట్లో చిన్న కార్లకు డిమాండ్
  • ఎగువ మధ్య తరగతికి అందుబాటులో కార్ల ధరలు
  • అమ్మకాల్లో పోటీ పడుతున్న మారుతి, హ్యుండాయ్
  • అత్యధిక అమ్మకాలతో ముందంజలో మారుతి సుజుకి

భారత్ లో చిన్న కార్లకు ఎంతో డిమాండ్ ఉంది. అయితే కరోనా సంక్షోభం వల్ల కార్ల విక్రయాల్లో రెండేళ్ల పాటు క్షీణత నమోదైంది. గత ఏడాది కాలంగా అమ్మకాలు పుంజుకోవడంతో కార్ల తయారీదారుల్లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా, చిన్న కార్ల అమ్మకాలు గతంలో మాదిరే అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో, భారత్ లో అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్న టాప్-10 హ్యాచ్ బ్యాక్ కార్లు ఇవే...

1. బాలెనో
మారుతి సుజుకి పోర్ట్ ఫోలియోలో ఎంతో స్టయిలిష్ గా ఉండే చిన్న కారు బాలెనో. మారుతి తన నెక్సా సిరీస్ లో వీటిని విక్రయిస్తోంది. భారత్ లో బాలెనో కారుకు ఎంతో డిమాండ్ ఉంది. గత ఫిబ్రవరిలో నమోదైన అమ్మకాలే అందుకు నిదర్శనం. 2023 ఫిబ్రవరిలో 18,592 బాలెనో కార్లు అమ్ముడయ్యాయి. రూ.6.56 లక్షలు-రూ.9.66 లక్షల ఎక్స్ షోరూం ధరల శ్రేణిలో ఇది లభ్యమవుతోంది.

2. స్విఫ్ట్
ఇది కూడా మారుతి సుజుకి సంస్థ తయారీనే. మారుతి సంస్థ విక్రయించే కార్లలో ఇది చాలా పాప్యులర్. ఎగువ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే కారు కావడంతో అమ్మకాల పరంగా రెండో స్థానంలో నిలిచింది. గత ఫిబ్రవరిలో మారుతి సుజుకి సంస్థ 18,412 స్విఫ్ట్ కార్లను విక్రయించింది. దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ.8.98 లక్షలు (ఎక్స్ షోరూం). ఇందులో 11 వేరియంట్లు ఉన్నాయి.

3. ఆల్టో
భారత్ లో లభ్యమయ్యే అత్యంత చవక కార్లలో ఆల్టో ఒకటి. ఆల్టో కూడా మారుతి సుజుకి సంస్థకు చెందినదే. ఆల్టోనే కాదు ఆల్టో కే10 కూడా భారత్ లో అందుబాటు ధరల్లో ఉండే కారుగా గుర్తింపు పొందింది. ఆల్టో కారు ఎక్స్ షోరూం ధరల శ్రేణి రూ.3.53 లక్షల నుంచి రూ.5.12 లక్షల వరకు ఉంది. గత ఫిబ్రవరిలో మారుతి సుజుకి సంస్థ 18,114 ఆల్టో మోడల్ కార్లను విక్రయించింది.

4. వాగన్ ఆర్
వాగన్ ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది కూడా మారుతి సుజుకి తయారీనే. లుక్స్ పరంగా ఎంతో ఆకట్టుకునేలా ఉండే వాగన్ ఆర్ అమ్మకాల పరంగానూ ఫర్వాలేదనిపిస్తోంది. గత నెలలో 16,899 వాగన్ ఆర్ కార్లు అమ్ముడయ్యాయి. దీని ప్రారంభ ధర రూ.5.53 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ.7.41 లక్షలు. ఇవి ఎక్స్ షోరూం ధరలు.

5. గ్రాండ్ ఐ10 నియోస్
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుండాయ్ భారత్ లో అడుగుపెట్టాక శాంట్రో మోడల్ తో ఇక్కడి ప్రజల మనసు దోచుకుంది. కాలక్రమంలో శాంట్రో ఉత్పత్తి ఆగిపోయినా, అదే డిజైన్ తో ఉండే గ్రాండ్ ఐ10 నియోస్ ను కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హ్యుండాయ్ సంస్థ 9,635 గ్రాండ్ ఐ10 నియోస్ కార్లను విక్రయించింది. దీని ప్రారంభ ధర రూ.5.58 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ.8.46 లక్షలు (ఎక్స్ షోరూం). ఇందులో 12 వేరియంట్లు ఉన్నాయి.

6. ఐ20
ఇది కూడా హ్యుండాయ్ సంస్థ తయారీనే. చిన్న కారు అయినా స్పోర్టీ లుక్ తో ప్రీమియం మోడళ్లకు దీటుగా నిలుస్తుంది. గత నెలలో హ్యుండాయ్ 9,287 ఐ20 కార్ల విక్రయాలు నమోదు చేసింది. అయితే ధర కాస్త ఎక్కువే. దీని ప్రారంభ ధర రూ.7.19 లక్షలు కాగా... హైఎండ్ వేరియంట్ ధర రూ.11.62 లక్షలు. ఇవి ఎక్స్ షోరూం ధరలు.

7. టియాగో
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ నుంచి ఉత్పత్తి అయ్యే చిన్నకారు... టియాగో. కంటికి ఇంపైన రూపం, ఫీచర్లతో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 2023 ఫిబ్రవరిలో టాటా సంస్థ 7,457 టియాగో కార్లను విక్రయించింది. టాటా టియోగో కారు ఎక్స్ షోరూం ధరలు రూ.5.53 లక్షల నుంచి రూ.8.05 లక్షల ధరల శ్రేణిలో ఉన్నాయి.

8. ఇగ్నిస్
ఇగ్నిస్... మారుతి సుజుకి పోర్ట్ ఫోలియోలోని మరో చిన్న కారు. సాలిడ్ లుక్ తో ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. గత ఫిబ్రవరిలో మారుతి సుజుకి సంస్థ 4,749 ఇగ్నిస్ కార్ల విక్రయాలు జరిపింది. ఇది రూ.5.82 లక్షలు-రూ.8.14 లక్షల (ఎక్స్ షోరూం) మధ్య అందుబాటులో ఉంది.

9. సెలెరియో
ఇది కూడా మారుతి సుజుకి ఉత్పాదనే. ఈ మిడ్ రేంజ్ హ్యాచ్ బ్యాక్ కారు ప్రారంభ ధర రూ.5.35 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ.7.13 లక్షలు. ఇవి ఎక్స్ షోరూం ధరలు. 2023 ఫిబ్రవరిలో 4,458 సెలెరియో మోడల్ కార్లను మారుతి సంస్థ విక్రయించింది.

10. గ్లాంజా
జపనీస్ కార్ల తయారీ దిగ్గజం టయోటా రూపొందించిన హ్యాచ్ బ్యాక్ మోడల్... గ్లాంజా. దీని ఎక్స్ షోరూం ధరలు రూ.6.66 లక్షల నుంచి రూ.9.99 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇందులో 9 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాదే ఇది మార్కెట్లోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టయోటా సంస్థ 4,223 గ్లాంజా కార్లను విక్రయించింది.

More Telugu News