New Delhi: 6 రోజుల్లో 5 సార్లు గుండెపోటు.. ప్రాణాలతో బయటపడ్డ 81 ఏళ్ల వృద్ధురాలు.. ఇదెలా సాధ్యమైందంటే..!

Elderly woman survives six consequtive heart attacks thank to AICD

  • శ్వాసకోస సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు 
  • 25 శాతానికి పడిపోయిన గుండె సామర్థ్యం 
  • ఏఐసీడీ అనే పరికరం సాయంతో చికిత్స 
  • ఆధునిక వైద్య శాస్త్రమే దీనికి కారణమన్నడాక్టర్లు

వైద్య రంగంలో తాజాగా ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు..వరుసగా 5 సార్లు గుండెపోటు వచ్చినా ఓ వృద్ధురాలు తట్టుకుని నిలబడ్డారు. 81 ఏళ్ల వయసులో ఆమె మరణం అంచుల వరకూ వెళ్లివచ్చారు. ఢిల్లీలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇటీవల ఓ వృద్ధురాలు శ్వాసకోస సంబంధిత సమస్యలతో స్థానిక మ్యాక్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటికే ఆమె ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. వృద్ధురాలి గుండె సామర్థ్యం 25 శాతానికి పడిపోయినట్టు గుర్తించారు. గుండె కొట్టుకునే తీరులోనూ లోపం కనిపించింది. 

ఈ క్రమంలో వైద్యులు వృద్ధురాలికి పేస్‌మేకర్ అమర్చారు. ఆ తరువాత ఉన్నట్టుండి ఆమె గుండె ఒక్కసారిగా స్తంభించిపోయింది. దీంతో.. వైద్యులు ఆటోమెటిక్ ఇంప్లాంటబుల్ కార్డియోవెర్టర్ డిఫ్రిబ్రిల్లేటర్(ఏఐసీడీ) అనే పరికరం సాయంతో గుండె పనితీరును సరిచేశారు. రోగుల ఛాతిలో అమర్చే ఈ వైద్య పరికరంతో గుండె సంబంధిత తీవ్ర సమస్యలను తొలగించవచ్చని మ్యాక్స్ ఆసుపత్రి వైద్యులు డా. బల్బీర్ సింగ్ తెలిపారు. దీంతో.. బాధితురాలి గుండె పనితీరు మెరుగై ఆమె క్రమంగా మేలుకున్నారు. 

వృద్ధురాలికి ఇతర చికిత్సలేవీ ఫలితం ఇవ్వకపోవడంతో తొలుత కుటుంబసభ్యులు ఆమెపై ఆశలు వదులుకున్నారు. అలాంటి సమయంలో వైద్యులు అనేక ప్రత్యామ్నాయాలు పరిశీలించి చివరకు ఏఐసీడీతో ఆమె ప్రాణాలు కాపాడారు. వృద్ధురాలు పూర్తిగా కోలుకోవడంతో ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ‘‘ఇది నిజంగా ఓ అద్భుతం’’ అని డా. సింగ్ మీడియాతో పేర్కొన్నారు. ఆధునిక వైద్య శాస్త్రంతో పాటూ మహిళ శక్తిసామర్థ్యాలే ఆమెను ఈ విపత్తు నుంచి గట్టెక్కేలా చేశాయని వివరించారు. మెనోపాజ్ తరువాత మహిళలు గుండెపోటు బారిన పడే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

  • Loading...

More Telugu News