Diabetes: డయాబెటిస్ రోగులకు గుడ్‌న్యూస్.. కృత్రిమ క్లోమ వ్యవస్థను అభివృద్ధి చేసిన పరిశోధకులు!
- ఇంజెక్షన్ల అవసరాన్ని తగ్గించనున్న కృత్రిమ క్లోమ వ్యవస్థ
- రక్తంలో గ్లూకోజ్ నిల్వలను కచ్చితంగా అంచనా వేసి అవసరమైన ఇన్సులిన్ ఉత్పత్తి
- పరిశోధన కోసం ఫైటోగ్లైకోజెన్ నానో కణాలను ఉపయోగించిన శాస్త్రవేత్తలు
టైప్-1 మధుమేహ బాధితులకు ఇది శుభవార్తే. సమీప భవిష్యత్తులో కృత్రిమ క్లోమ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. రక్తంలో గ్లూకోజ్ నిల్వల నియంత్రణ కోసం తీసుకునే ఇంజెక్షన్ల అవసరాన్ని తగ్గించే దిశగా ఈ సరికొత్త నానో సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకుల నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సమర్థ కృత్రిమ క్లోమ వ్యవస్థను అభివృద్ధి చేసింది. మధుమేహ రోగుల రక్తంలోని గ్లూకోజ్ నిల్వలను ఇది పూర్తి కచ్చితత్వంతో గుర్తించి అవసరమైన ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
రెండుసార్లకు తగ్గనున్న ఇంజెక్షన్ అవసరం
ఈ కృత్రిమ క్లోమ వ్యవస్థ అభివృద్ధి కోసం పరిశోధకులు అణువుల గొలుసుగా పిలిచే ఫైటోగ్లైకోజెన్ నానో కణాలను ఉపయోగించారు. ఇతర వ్యవస్థలతో పోలిస్తే ఇన్సులిన్ సానుకూల ప్రభావాలు ఎక్కువ సేపు కొనసాగేలా ఈ వ్యవస్థ చూస్తుందని పరిశోధకులు తెలిపారు. మధుమేహ రోగులు ప్రస్తుతం రోజుకు దాదాపు ఐదారుసార్లు ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ తీసుకుంటున్నారు. అయితే, ఈ కృత్రిమ క్లోమ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రెండుసార్లు ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.