IPL: డేవిడ్ వార్నర్ కు మళ్లీ ఐపీఎల్ కెప్టెన్సీ
- ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా ఎంపికైన వార్నర్
- వైస్ కెప్టెన్ బాధ్యతలు అక్షర్ పటేల్ కు అప్పగింత
- రోడ్డు ప్రమాదంలో గాయపడి ఈ సీజన్ కు దూరమైన రిషబ్ పంత్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో మరోసారి కెప్టెన్ గా అలరించాడు. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ట్రోఫీ గెలిచిన వార్నర్.. 2021లో కెప్టెన్సీ కోల్పోయాడు. ఆ తర్వాత హైదరాబాద్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత అతను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. ఢిల్లీ కెప్టెన్ గా రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆటకు దూరం అయ్యాడు. అతను కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టనుంది. ఈ ఏడాది ఐపీఎల్ లో అతను పాల్గొనడం లేదు.
ఈ నేపథ్యంలో పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ ఈ సీజన్ లో తమ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం ప్రకటించింది. వైస్ కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను నియమించింది. ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం వార్నర్‌కు ఉండటంతో అతనికే కెప్టెన్సీ ఇచ్చింది. 2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత ఒకసారి హైదరాబాద్‌ను చాంపియన్‌గా నిలిపాడు. ఐదు సార్లు ప్లేఆఫ్స్ కు తీసుకెళ్లాడు.