Ola S1: ఓలా స్కూటర్ల ఫ్రంట్ ఫోర్క్ పై ఆందోళనలు.. ఉచిత మార్పిడికి కంపెనీ నిర్ణయం
- ఓలా ఎస్1 స్కూటర్లలో ఫ్రంట్ సస్పెన్షన్ సమస్యలు
- విరిగిపోయి ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు
- మరింత బలమైన, మన్నికైన ఫ్రంట్ సస్పెన్షన్ ను అమర్చనున్న ఓలా
ఓలా యూజర్లకు శుభవార్త. ఇటీవలి కాలంలో ఓలా స్కూటర్లకు ముందు భాగంలో సింగిల్ సస్పెన్షన్ విరిగిపోయి పలువురు గాయపడిన ఘటనలు వెలుగులోకి రావడం తెలిసిందే. తన భార్య కేవలం 35 కిలోమీటర్ల స్పీడ్ లో వెళుతున్న సమయంలోనే ముందు ఫోర్క్ విరిగిపోవడంతో తీవ్రంగా గాయపడిందంటూ ఓ వ్యక్తి ఈ ఏడాది జనవరిలో ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీంతో ఓలా ఎలక్ట్రిక్ స్పందించింది. ఓలా ఎస్1 స్కూటర్లకు సంబంధించి ముందున్న సస్పెన్షన్ ను ఉచితంగా మార్చనున్నట్టు ప్రకటించింది.
కేవలం ఓలా ఎస్1 స్కూటర్లున్న వారికే ఈ అవకాశం. కస్టమర్లు సమీపంలోని ఓలా ఎక్స్ పీరియన్స్ కేంద్రానికి వెళితే చాలు. ఫ్రంట్ సస్పెన్షన్ ను ఉచితంగా మార్చనున్నారు. ఓలా ఎస్ 1 స్కూటర్లలోనే ఫ్రంట్ సస్పెన్షన్ బ్రేకింగ్ ఫెయిల్యూర్ ఘటనలు రావడంతో, దీనికే మార్చాలని కంపెనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
‘‘మా నిరంతర ఇంజనీరింగ్ డిజైన్ మెరుగుదల ప్రక్రియలో భాగంగా ఫ్రంట్ ఫోర్క్ డిజైన్ ను ఇటీవలే నవీకరించాం. మరింత మన్నికతో, బలంగా ఉండేలా దీన్ని తయారు చేశాం’’ అని ఓలా ఎలక్ట్రిక్ ట్విట్టర్ లో పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ప్రకటనను పోస్ట్ చేసింది. ఉచితంగా ఫ్రంట్ సస్పెన్షన్ మారుస్తామని, సమీపంలోని సర్వీస్ సెంటర్ లేదా ఎక్స్ పీరియన్స్ సెంటర్ లో సంప్రదించాలని ఓలా సూచించింది. ఈ నెల 22 నుంచి కస్టమర్లు అపాయింట్ మెంట్ బుక్ చేసుకునేందుకు వీలుగా విండో తెరుస్తామని ఓలా ప్రకటించింది.