Joe Biden: జర్నలిస్టుల ప్రశ్నల వర్షం.. అలా నడుచుకుంటూ వెళ్లిపోయిన బైడెన్.. వీడియో వైరల్!

biden leaves press meet and walking out has gone viral
  • మరోసారి ప్రెస్ మీట్ మధ్యలోనే వెళ్లిపోయిన బైడెన్
  • బ్యాంకుల సంక్షోభంపై మీడియా ప్రతినిధుల వరుస ప్రశ్నలు
  • వాటికి సమాధానం చెప్పకుండానే బయటికి దారితీసిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరోసారి ప్రెస్ మీట్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఒకవైపు జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతుంటే.. తనకేం సంబంధం లేదన్నట్లుగా.. కనీసం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైడెన్ గతంలో కూడా ఇలా మధ్యలోనే వెళ్లిపోయారు.

అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకుల సంక్షోభం గురించి బైడెన్‌ మాట్లాడుతూ.. తమ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగానే ఉందని చెప్పారు. డిపాజిటర్ల డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ సమయంలో పలువురు మీడియా ప్రతినిధులు వరుస ప్రశ్నలు అడిగారు.

సంక్షోభం ఎందుకు తలెత్తిందనే దానిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? దీని తదనంతర పరిణామాలు ఉండవని మీరు అమెరికన్లకు భరోసా ఇవ్వగలరా? అని బైడెన్ ను జర్నలిస్టులు అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానాలివ్వని బైడెన్.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన వెనుక వైపు ఉన్న డోర్ గుండా బయటికి వెళ్లిపోయారు.

బైడెన్ వెళ్తున్నప్పుడు కూడా.. ‘మరికొన్ని బ్యాంకులకు ఇలాంటి పరిస్థితే తలెత్తుందా..?’ అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ప్రెస్ మీట్ జరుగుతున్న గది తలుపు వేసి, బయటకు వెళ్లిపోయారు. ఆయన బయటికి వెళ్లే దాకా మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తూనే ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన విజువల్స్.. వైట్ హౌస్ కు చెందిన యూట్యూబ్ చానల్‌లో వైరల్ గా మారాయి. వైట్ హౌస్ సిబ్బంది యూట్యూబ్ కామెంట్స్ ను ఆఫ్ చేశారు.

ఈ మధ్య చైనా నిఘా బెలూన్‌ ఘటనపై జరిగిన సమావేశంలోనూ ఇలానే మధ్యలోనే బైడెన్ వెళ్లిపోయారు. ‘చైనాలో ఉన్న మీ కుటుంబ వ్యాపారాల వల్ల దేశ భద్రత విషయంలో మీరు రాజీపడ్డారా..?’ అనే ప్రశ్న ఎదురుకాగా.. ‘నాకు కొంచెం బ్రేక్‌ ఇవ్వండి’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Joe Biden
biden leaves press meet
silicon valley bank
signature bank
press conference

More Telugu News