Ramcharan: వీరిద్దరూ భారత సినీ పరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు: రామ్ చరణ్
- రాజమౌళి, కీరవాణి ఇద్దరూ అత్యంత విలువైన రత్నాలన్న చరణ్
- ప్రపంచ వ్యాప్తంగా నాటునాటు ఎమోషన్ ఉందని వ్యాఖ్య
- తారక్ తో మళ్లీ చేయాలనుందన్న చరణ్
'ఆర్ఆర్ఆర్' చిత్రం భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా చాటింది. 'నాటునాటు' పాట ఆస్కార్ అవార్డును సాధించడంతో ఈ సినిమా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ స్పందిస్తూ... ఇప్పటికీ తనకు కలలో ఉన్నట్టుగానే ఉందని చెప్పారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఎప్పటికీ నిలిచి పోతుందని అన్నారు. తమ జీవితాల్లో ఈ సినిమా చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. రాజమౌళి, కీరవాణి ఇద్దరూ భారతీయ సినీ పరిశ్రమలో రెండు అత్యంత విలువైన రత్నాలని కొనియాడారు. మాస్టర్ పీస్ లాంటి ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చినందుకు వీరిద్దరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నాటునాటుకు సంబంధించిన ఎమోషన్ ఉందని రామ్ చరణ్ అన్నారు. చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ అందరూ కలిసి ఈ ఎమోషన్ ను క్రియేట్ చేశారని కితాబిచ్చారు. సోదరుడు తారక్ తో కలిసి మళ్లీ డ్యాన్స్ చేయాలని, మళ్లీ రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన కోస్టార్ అలియా భట్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ ఆస్కార్ అవార్డు ప్రతి ఇండియన్ యాక్టర్ కు, టెక్నీషియన్ కు, సినీ అభిమానికి చెందుతుందని చెప్పారు. 'మనం గెలిచాం. ఒక భారతీయ చిత్ర పరిశ్రమగా మనం గెలిచాం. ఒక దేశంగా మనం గెలిచాం. మన ఇంటికి ఆస్కార్ వస్తోంది' అని ట్వీట్ చేశారు.