Narendra Modi: మీ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో నింపిందంటూ సానియాకు మోదీ లేఖ

PM Narendra Modi pens heartfelt letter to Sania Mirza after tennis stars retirement

  • ఇటీవల టెన్నిస్ కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా
  • ఆమెను అభినందిస్తూ రెండు పేజీల లేఖ రాసిన ప్రధాని మోదీ
  • భారత క్రీడారంగంపై చెరగని ముద్ర వేశారంటూ కితాబు

ఇటీవల కెరీర్ కు వీడ్కోలు ప్రకటించిన భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. అద్భుత కెరీర్ ను ముగించిన సానియాను అభినందిస్తూ మోదీ రెండు పేజీల లేఖ రాశారు. చాంపియన్ సానియా అంటూ రాసిన మోదీ.. భారత క్రీడారంగంపై ఆమె చెరగని ముద్ర వేశారని కితాబిచ్చారు. రాబోయేతరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. 

‘ఇకపై మీరు టెన్నిస్‌ ఆడబోరనే విషయాన్ని అభిమానులు జీర్ణంచేసుకోలేరు. మీరు ఆడటం ప్రారంభించినప్పుడు దేశంలో టెన్నిస్‌  పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. మహిళలు టెన్నిస్‌లో రాణించగలరని మీరు మీ ఆటతో నిరూపించారు. ఆటలను కెరీర్‌గా తీసుకోవాలనుకునే ప్రతీ మహిళకు మీరు సాధించిన విజయం చాలా బలాన్ని ఇచ్చింది. మీ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో నింపింది. జనవరి 13న మీ కెరీర్ కు సంబంధించిన విషయాన్ని ప్రకటించారు. అప్పుడు ఆరేళ్ల చిన్నారి నుంచి ప్రపంచ స్థాయి టెన్నిస్‌ క్రీడాకారిణిగా ఎదిగిన మీ ప్రయాణాన్ని అద్భుతంగా వ్యక్తపరిచారు. దేశానికి పతకాలు సాధించడం మీకెంతో గౌరవం అని పేర్కొన్నారు. కానీ మీరు భారత దేశానికి గర్వకారణమని నేను చెప్పగలను’ అని ప్రధాని పేర్కొన్నారు. 

ప్రధాని మోదీ పంపిన అభినందన సందేశాన్ని సానియా తన ట్విటర్ లో షేర్ చేసింది. ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. దేశం గర్వపడేలా చేసేందుకు కృషి చేస్తూనే ఉంటానని చెప్పింది.

More Telugu News