Maharashtra: యాచకులను నిషేధించిన నాగపూర్ సిటీ
- రోడ్లపై అడుక్కుంటూ కనిపిస్తే ఆరు నెలల జైలు శిక్ష
- ఈ ఆదేశాలు ట్రాన్స్ జెండర్లకూ వర్తిస్తాయని వివరణ
- జి 20 సదస్సు సందర్భంగా పోలీసుల నిర్ణయం
రోడ్లపై, కూడళ్లు ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర అడుక్కోవడాన్ని మహారాష్ట్రలోని నాగపూర్ పోలీసులు నిషేధించారు. ఎవరైనా యాచిస్తూ కనిపిస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. యాచకులు మాత్రమే కాదు ట్రాన్స్ జెండర్ల విషయంలోనూ ఇదే పద్ధతి పాటిస్తామని స్పష్టం చేశారు. ఈమేరకు సిటీ పోలీస్ బాస్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. జి20 సదస్సు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 144 ఆధారంగా సిటీ పోలీస్ చీఫ్ అమితేశ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందని, ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటుందని అమితేశ్ వివరించారు. నిషేధాజ్ఞలు పట్టించుకోకుండా ఎవరైనా యాచిస్తూ పట్టుబడితే ఆరు నెలల పాటు జైలుకు పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. మార్చి 19, 20 తేదీలలో జి20 సదస్సు, సి20 సమావేశాలు సిటీలో జరగనున్నాయి. దీంతో నగరంలో యాచకులు, ట్రాన్స్ జెండర్లపై ఆంక్షలు పెట్టినట్లు సమాచారం. అయితే, ఈ సదస్సులతో పాటు ఇతరత్రా కారణాల వల్లే యాచకులపై నిషేధం విధిస్తున్నట్లు అమితేశ్ తెలిపారు.