Manish Sisodia: నన్ను జైలులో పెట్టగలరు కానీ..: ఆప్ నేత సిసోడియా
- స్వాతంత్ర్య పోరాటంలోనూ ఇలాగే జరిగిందన్న ఆప్ నేత
- శుక్రవారం సిసోడియాను ఈడీ కస్టడీకి అప్పగించిన కోర్టు
- కస్టడీపై ట్విట్టర్ లో స్పందించిన సిసోడియా టీమ్
‘నన్ను జైలులో పెట్టి ఇబ్బందులకు గురిచేయగలరు కానీ నా సంకల్పాన్ని ఏమాత్రం దెబ్బతీయలేరు..’ అంటూ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా శనివారం పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. మనీశ్ సిసోడియా తరఫున ఆయన టీమ్ ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ వ్యవహారంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సిసోడియాను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. ఈడీ అధికారుల విజ్ఞప్తిని మన్నించిన కోర్టు.. ఏడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా టీమ్ ట్విట్టర్ లో స్పందించింది.
స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఆంగ్లేయులు ఇదే విధానాన్ని అవలంబించారని సిసోడియా తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఫ్రీడమ్ ఫైటర్లను జైలులో పెట్టి, వారి నైతిక స్థైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. అప్పుడు ఆంగ్లేయులు అవలంబించిన విధానాన్నే ఇప్పుడు అధికారులు పాటిస్తున్నారని ఆరోపించారు. తనను జైలులో పెట్టడం, ఇబ్బందులకు గురిచేయడం మాత్రమే వారికి చేతనవుతుందని సిసోడియా పేర్కొన్నారు. తన సంకల్పాన్ని కదిలించడం మీవల్ల కాదంటూ ట్వీట్ చేశారు.