Telangana: కొత్త సచివాలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్.. వీడియో ఇదిగో

Cm Kcr visits New Secretariat And Observe The Work Today
  • ఏప్రిల్ 30న ప్రారంభించాలని సూత్రప్రాయ నిర్ణయం
  • సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
  • అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణ పనులూ సందర్శన
తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ ఉదయం హైదరాబాద్ లో నిర్మిస్తున్న నూతన సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయ పనులను పరిశీలించారు. మొదటిసారి సచివాలయం లోపలికి వెళ్లి చూశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఐమాక్స్ పక్కనే ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ పనులను కూడా పరిశీలించారు. సచివాలయం ఎదురుగా నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను సైతం సీఎం కేసీఆర్ పరిశీలించి తగు సూచనలు చేశారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయాన్ని ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. తర్వాత దాన్ని ఏప్రిల్ 14వ తేదీకి వాయిదా వేశారు. తాజాగా ఏప్రిల్ 30న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

అలాగే, జూన్2న అమరవీరుల స్మారక స్తూపం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆయన జయంతి అయిన ఏప్రిల్ 14న ఆవిష్కరించాలని రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. కాగా, సచివాలయం, స్మారక స్తూపం, అంబేద్కర్ విగ్రహాలను పరిశీలించిన ముఖ్యమంత్రి వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ ఉన్నారు.
Telangana
KCR
New Secretariat

More Telugu News