Prisoner: చర్లపల్లి ఓపెన్ జైలు నుంచి ఖైదీ పరారీ

Murder convict escapes from Cherlapally open jail

  • నడవడిక బాగుందని ఓపెన్ జైలుకు మారిస్తే పారిపోయిన ఖైదీ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన జైలు అధికారులు
  • సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న సిబ్బంది
  • గాలింపు చర్యలు చేపట్టి ఖైదీ కుటుంబాన్ని అలర్ట్ చేసినట్లు వెల్లడి

క్షణికావేశంలో చేసిన హత్యకు పశ్చాత్తాప పడుతున్నాడు.. జైలులో సత్ర్పవర్తనతో మెలుగుతున్నాడని ఓపెన్ జైలుకు మార్చిన ఖైదీ అవకాశం చిక్కగానే పరారయ్యాడు. గురువారం చర్లపల్లి ఓపెన్ జైలు నుంచి మాలోతు హుస్సేన్ (55) అనే ఖైదీ పారిపోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన జైలు సిబ్బంది.. హుస్సేన్ కోసం గాలింపు చేపట్టారు. జైలు ఆవరణలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. హుస్సేన్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చామని, ఇంటికి వస్తే తమకు తెలియజేయాలని వివరించారు. కాగా, ఓ హత్య కేసులో హుస్సేన్ చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పటికే ఏడేళ్ల పది నెలల శిక్ష అనుభవించాడని, మరో 20 ఏళ్ల ఆరు నెలలు శిక్ష అనుభవించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

జైలులో నడవడిక బాగున్న ఖైదీలను అధికారులు ఓపెన్ జైలుకు మారుస్తారు. చుట్టూ ఫెన్సింగ్, నామమాత్రంగా జైలు సిబ్బంది ఉండే ఈ ఓపెన్ జైలు ఖైదీలకు కొద్దిపాటి స్వేచ్ఛను అందిస్తుంది. పారిపోయేందుకు ప్రయత్నించినా, పారిపోయి పట్టుబడినా శిక్ష పెరగడంతో పాటు అప్పటి వరకూ అనుభవించిన ఆ కాస్త స్వేచ్ఛ కూడా పోతుంది. అందుకే ఓపెన్ జైలులోని ఖైదీలు మిగతావారికి లేని, తమకు మాత్రమే లభించిన ఆ పరిమిత స్వేచ్ఛను వదులుకోవడానికి ఇష్టపడరు. ఈ కారణంగానే ఓపెన్ జైలుకు ఉన్న గేట్ల దగ్గర సిబ్బంది పెద్దగా ఉండరు. చర్లపల్లి ఓపెన్ జైలుకు ఉన్న కొన్ని గేట్ల దగ్గర అసలు సిబ్బందే లేరని సమాచారం. 

ఓపెన్ జైలులో ఉన్న ఈ లొసుగును హుస్సేన్ అవకాశంగా మలుచుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో పెరోల్ పై బయటకు వచ్చిన హుస్సేన్ ఫిబ్రవరి 2న తిరిగి జైలుకు వచ్చేశాడు. మిగతా ఖైదీలతో పాటే కిచెన్ లో పని చేస్తున్నాడు. గురువారం కూడా కిచెన్ లో పనిచేస్తూ వీలు చూసుకుని పారిపోయాడు. కాసేపటికి హుస్సేన్ కనిపించకపోవడంతో తోటి ఖైదీలు అధికారులకు సమాచారం అందించారు. జైలు ఆవరణ మొత్తం వెతికినా కనిపించకపోవడంతో హుస్సేన్ పరారైనట్లు పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. హుస్సేన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హుస్సేన్ కుటుంబ సభ్యులతో పాటు అతడు వెళ్లేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసులను అలర్ట్ చేశారు.

  • Loading...

More Telugu News