Andhra Pradesh: ఏపీలో పాఠశాల విద్యార్థులకు ‘రాగిజావ’.. రెండోసారీ వాయిదా!
- పాఠశాల విద్యార్థులకు అదనపు ఆహారం అందించాలని నిర్ణయం
- తొలుత ఈ నెల 2న ప్రారంభిస్తామన్న విద్యాశాఖ
- ఆ తర్వాత 10కి వాయిదా.. ఇప్పుడు 21కి వాయిదా వేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించాలనుకున్న రాగిజావ పథకం రెండోసారి కూడా వాయిదా పడింది. విద్యార్థులకు అదనపు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 2వ తేదీ నుంచి విద్యార్థులకు రాగిజావను పంపిణీ చేయనున్నట్టు తొలుత ప్రకటించింది. అయితే, ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని నేటికి (10వ తేదీ) వాయిదా వేసింది.
రాగి జావను ఎలా తయారు చేయాలి? అందుకు కావాల్సిన వస్తువులేంటి? రేషన్ షాపు వద్ద వాటిని ఎలా తీసుకోవాలి అన్న వివరాలను బుధవారం విద్యాశాఖ విడుదల చేసింది. అయితే, మళ్లీ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. రాగిజావ కార్యక్రమాన్ని ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్టు చెబుతూ జిల్లా అధికారులకు నిన్న సమాచారం అందించింది.