women: మహిళలూ.. ఈ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు
- పునరుత్పత్తి వ్యవస్థ ఎంతో సున్నితమైనది
- పలు అనారోగ్య సమస్యలకు అవకాశాలు ఎక్కువ
- అవసరమైతే చికిత్స తీసుకునేందుకు వెనుకాడొద్దు
మహిళలకు పునరుత్పత్తి వ్యవస్థ ఎంతో కీలకం. అంతేకాదు ఇది ఎంతో సున్నితమైనది. పరిశుభ్రంగా ఉంచుకుంటూ, శ్రద్ధ చూపించడం ద్వారా వ్యాధుల రిస్క్ తలెత్తకుండా చూసుకోవచ్చు. ఈ పునరుత్పత్తి వ్యవస్థతోపాటు, మహిళల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన రిస్క్ లు ఉన్నాయి.
సర్వైకల్ కేన్సర్
ఇది గర్భాశయ ముఖద్వార కేన్సర్. సెర్విక్స్ లో ట్యూమర్ ఏర్పడి కేన్సర్ గా మారుతుంది. హ్యుమన్ పాపిలోమా వైరస్ కారణంగా గర్భాశయ కేన్సర్ వస్తుంది. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే బయటపడొచ్చు. అందుకని 35 ఏళ్లు దాటిన మహిళలు రెండేళ్లకు ఓసారి అయినా పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి.
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్
హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ సమస్య వస్తుంది. అండాశయాలలో చిన్న సంచులు, తిత్తులు ఏర్పడతాయి. ఈ తిత్తులు (సిస్ట్ లు) ఉండడం వల్ల అండాలు సరిగ్గా విడుదల కావు. దాంతో సంతాన నిరోధకంగా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వ్యవహరిస్తుంది. పీరియడ్స్ కూడా క్రమం తప్పి వస్తుంటాయి.
ల్యూపస్
దీన్ని సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటోసస్ (ఎస్ఎల్ఈ) అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. వైరస్, బ్యాక్టీరియా, ఫంగి తదితర బయటి నుంచి వచ్చిన వాటిపై మన శరీర రోగ నిరోధక వ్యవస్థ దాడి చేయడం వల్ల మనకు రక్షణ ఏర్పడుతుంది. కానీ ల్యూపస్ లో రోగ నిరోధక వ్యవస్థ సొంత టిష్యూలపైనే దాడి జరుగుతుంది. దీనివల్ల నొప్పులు, దీర్ఘకాలంలో అవయవాల వైఫల్యం ఏర్పడతాయి.
ఎండో మెట్రియోసిస్
గర్భాశయం లోపలి వైపు ఉండే టిష్యూలు, ముఖ్యంగా ఎండో మెట్రియం అనేది గర్భాశయం బయటి వైపు పెరుగుతుంది. ఎండో మెట్రియోసిస్ సిస్ట్ లు ఏర్పడేలా చేస్తుంది. ఇవన్నీ కలసి సంతాన భాగ్యం లేకుండా అడ్డు పడతాయి.
మూత్రాశయ ఇన్ఫెక్షన్లు
సూక్ష్మ జీవులు మూత్రకోశంలోకి ప్రవేశించినప్పుడు ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. దీనివల్ల ఇన్ ఫ్లమ్మేషన్, నొప్పి కనిపిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ ను గుర్తించి నయం చేసుకోకపోతే అప్పుడు అది కిడ్నీలకు వ్యాపిస్తుంది. పునరుత్పత్తి అవయవం, మూత్రాశయం వద్ద మంట, దురద, నొప్పి ఎలాంటి ఇబ్బందులున్నా సంకోచించకుండా వైద్యులను సంప్రదించాలి.