Chandrababu: చంద్రబాబు వల్లే ప్రాణాలతో ఉన్నా.. యువగళం యాత్రలో వైసీపీ నేత మనోగతం

Am still alive because of ex cm chandrababu says ycp leader in yuvagalam

  • జ‌గ‌న్ కోసం ప్ర‌మాదంలో పడ్డానానీ, చంద్రబాబు ఆదుకున్నారని చెప్పిన అశోక్ 
  • పార్టీలు, కులమతాలు చూడకుండా సాయం చేశారు
  • లోకేశ్ ను క‌లిసి కృత‌జ్ఞ‌త తెలిపిన వైసీపీ నేత‌ కుటుంబం

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యాత్రలో బుధవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లోకేశ్ చేపట్టిన యువగళం యాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. నియోజకవర్గంలోని చింతపర్తిలో ఏర్పాటు చేసిన విడిదిలో ఆగిన నారా లోకేశ్ ను స్థానికులు కలుసుకున్నారు. వారితో మాట్లాడుతున్న లోకేశ్ ముందుకు చింతలవారిపల్లి మాజీ సర్పంచ్, వైసీపీ నేత అశోక్ కుటుంబం వచ్చింది. కులమతాలు, పార్టీ ఏదనేది పట్టించుకోకుండా చంద్రబాబు చేసిన సాయం వల్లే తానిప్పుడు ప్రాణాలతో ఉన్నానని అశోక్ అన్నారు.

వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రమాదానికి గురై, మంచానపడితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే తనను ఆదుకున్నాడని చెప్పారు. సీఎంఆర్ఎఫ్ నిధులు రూ.30 లక్షలు విడుదల చేయడంతో వైద్యం చేయించుకుని, కోలుకున్నట్లు అశోక్ వివరించారు. అప్పట్లో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టడంతో వైసీపీ నేతగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు అశోక్ చెప్పారు. ఏర్పాట్ల కోసం పార్టీ బ్యానర్లు తీసుకొస్తుండగా ప్రమాదం జరిగిందని, రెండు నెలలు మంచానికే పరిమితమయ్యానని వివరించారు. పార్టీ కానీ, జగన్ కానీ పట్టించుకోకపోవడంతో టీడీపీ నేత నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని ఆశ్రయించామని అశోక్ దంపతులు పేర్కొన్నారు.

తన పరిస్థితిని కిశోర్ కుమార్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని, ఆయన వెంటనే సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి రూ.30 లక్షలు విడుదల చేశారని చెప్పారు. ఆ డబ్బుతో చికిత్స చేయించుకుని, కోలుకున్నానని అశోక్ వివరించారు. కులమతాలు, పార్టీల భేదాలు చూడకుండా చంద్రబాబు ఆనాడు సాయం చేయకుంటే ఏంజరిగేదని ఆలోచించడానికే భయమేస్తోందని చెప్పారు. జగన్ కోసం ప్రమాదంలో పడితే, చంద్రబాబు తనను ఆదుకున్నారని అంటూ నారా లోకేశ్ కు అశోక్ కుటుంబం కృతజ్ఞ‌త తెలిపింది.

More Telugu News