Sunil Gavaskar: పిచ్ ఎలా ఉండాలో చెప్పిన గవాస్కర్
- అహ్మదాబాద్ వేదికగా 9వ తేదీ నుంచి నాలుగో టెస్టు
- బ్యాట్ కు, బాల్ కు మధ్య సమతుల్యత ఉండేలా పిచ్ ఉండాలన్న గవాస్కర్
- పిచ్ టర్న్ అయితే ఇండియా గెలుస్తుందని అంచనా
ఇండోర్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో ఇండియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. చివరి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా ఈనెల 9 నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ఉండాలనే దానిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బ్యాట్ కు, బాల్ కు మధ్య సమతుల్యత ఉండేలా పిచ్ ఉండాలని ఆయన అన్నారు.
తొలి రెండు రోజులు కొత్త బంతి బౌలర్లకు సహకరించేలా ఉండాలని... ఇదే సమయంలో బ్యాట్స్ మెన్ పరుగులు చేసేలా ఉండాలని చెప్పారు. మూడు, నాలుగు రోజుల్లో బంతి స్పిన్ కావాలని అన్నారు. అహ్మదాబాద్ లో ఎలాంటి ఫలితం వస్తుందో తాను అంచనా వేయలేనని చెప్పారు. ఒక వేళ పిచ్ టర్న్ అయితే భారత్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు.