mumbai: ముంబైలో పార్కింగ్ కష్టాలకు మొబైల్ యాప్ తో చెక్
- స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసురానున్న బీఎంసీ
- ముందే బుక్ చేసుకునేందుకు ఏర్పాట్లు
- త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ట్రాఫిక్ సంగతి చెప్పక్కర్లేదు. దీనికి పార్కింగ్ స్థలం కోసం వెతుకులాట అదనం. ఇంట్లో నుంచి సొంతవాహనంలో బయటకు వెళ్లాలంటే పార్కింగ్ ప్లేస్ దొరుకుతుందో లేదోననే టెన్షన్ వాహనదారులను వేధిస్తుంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి త్వరలో కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. ముంబైకర్ల పార్కింగ్ కష్టాలను తొలగించేందుకు సెంట్రలైజ్డ్ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.
సిటీలో అన్ని పార్కింగ్ ప్లేసులకు స్లాట్లు తయారుచేసి ఈ యాప్ ద్వారా ముందే బుక్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ ప్రతిపాదన చేసింది. ఇందులో భాగంగా సాఫ్ట్ వేర్ తయారుచేసి ఇచ్చేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్ పీ) ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ముంబైలోని 32 పబ్లిక్ పార్కింగ్ స్లాట్లు, మాల్స్, ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్, స్ట్రీట్ పార్కింగ్ ప్లేసుల వివరాలను పొందుపరిచి రూపొందించే ఈ పార్కింగ్ యాప్ తో వాహనదారులు మెరుగైన సేవలు అందుకోవచ్చని బీఎంసీ అధికారులు తెలిపారు.
ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందే వాహనదారులు తాము వెళ్లాల్సిన చోటుకు దగ్గర్లో పార్కింగ్ స్లాటును బుక్ చేసుకోవచ్చని, ముందుగా పేమెంట్ చేసే అవకాశం కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. మాల్స్ యాజమాన్యాలు తమ పార్కింగ్ ప్లేసును పబ్లిక్ కోసం ఆఫర్ చేయాలనుకుంటే ఒప్పందం కుదుర్చుకుని, వారికి చెల్లింపులు జరుపుతామని వివరించారు.