Umasankar Reddy: మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు: వివేకా హత్యకేసు నిందితుడు ఉమాశంకర్ రెడ్డి భార్య

Threats to Umasankar Reddy wife

  • వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి
  • వివేకాను చంపినట్టే ఉమాశంకర్ రెడ్డిని చంపుతామని హెచ్చరిక
  • ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతిపై దాడి
  • ఆసుపత్రిలో చేరిన స్వాతి
  • కసునూరి పరమేశ్వర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు ఎదురయ్యాయి. నిన్న మధ్యాహ్నం కసునూరు పరమేశ్వర్ రెడ్డి, ఆయన కొడుకు తమ ఇంటి వద్ద భయానక వాతావరణం సృష్టించారని ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి వెల్లడించారు. తన భర్తను చంపేస్తామని హెచ్చరించారని, చెప్పలేని విధంగా బూతులు తిట్టారని ఆమె ఆక్రోశం వ్యక్తం చేశారు. 

చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారని, తన ఫోన్ ను లాక్కుని కిందపడేశారని ఆమె వెల్లడించారు. ఈ దాడిలో తనకు గాయాలు తగిలాయని, చికిత్స కోసం పులివెందుల ఆసుపత్రిలో చేరానని స్వాతి తెలిపారు. 

"నిన్న మధ్యాహ్నం 1.45 గంటలకు కసునూరు పరమేశ్వర్ రెడ్డి మా ఇంటి వద్దకు వచ్చి వీరంగం వేశాడు. వివేకాను చంపేసి ఇక్కడొచ్చి కూర్చున్నారా అంటూ బూతులు తిట్టాడు. నీ భర్త ఇంటికి వచ్చాక, వివేకాను ఎలా చంపారో అతడ్ని కూడా అలాగే చంపుతామని హెచ్చరించారు. నిన్ను కూడా చంపుతాం, నిన్ను చంపితే ఇక్కడ దిక్కెవ్వరు? అంటూ నన్ను బెదిరించారు. వారు మాట్లాడిన బూతులు నేను చెప్పలేను. కాలికి ఉన్న చెప్పు తీసి కొట్టడం ప్రారంభించాడు. దాంతో మరో గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాను" అని స్వాతి ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.

More Telugu News