Tollywood: వరుణ్​ తేజ్ సరసన మిస్ వరల్డ్

Manushi Chhillar to pair with Varun tej

  • ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ పాన్ ఇండియా సినిమా
  • పైలట్ పాత్రలో నటిస్తున్న మెగా హీరో
  • హీరోయిన్ గా మానుషి చిల్లార్ ఎంపిక

ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆరంభంలోనే వరుస హిట్లు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్. కంచె, ఫిదా, అంతరిక్షం, ఎఫ్2, గద్దలకొండ గణేష్ చిత్రాలు అతనికి స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. కానీ, అదే జోరు కొనసాగించలేకపోయిన వరుణ్ ఇప్పుడు పరాజయాల్లో ఉన్నాడు. గతేడాది విడుదలైన గని, ఎఫ్3 రెండూ నిరాశ పరిచాయి. దాంతో, కథల ఎంపికపై వరుణ్ ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండివధారి అర్జున' అనే చిత్రంలో నటిస్తున్న వరుణ్.. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మాణంలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. 

పాన్ ఇండియా చిత్రం కావడంతో ఆ స్థాయిలోనే తారాగణం ఉండేలా చూస్తున్నారు నిర్మాతలు. వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ను ఎంపిక చేశారు. అక్షయ్ కుమార్‌‌ ‘సామ్రాజ్ పృథ్వీరాజ్’ చిత్రంతో మానుషి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కాగా, వాస్తవ సంఘటన ఆధారంగా వాయుసేనలో ఎదురయ్యే సవాళ్లను చూపించబోయే యాక్షన్ సినిమాలో వరుణ్ తేజ్ ఫైలట్‌గా కనిపిస్తాడు. హీరోయిన్ మానుషి రాడార్ ఆఫీసర్ పాత్ర పోషించనుంది. ఆమె పాత్రను తెలియజేస్తూ చిత్ర బృందం చిన్న టీజర్ ను కూడా విడుదల చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది.

Tollywood
Bollywood
pan india
Varun Tej
Manushi Chhillar

More Telugu News