women premier league: నేటి నుంచే మహిళల ప్రీమియర్ లీగ్.. గుజరాత్, ముంబై మధ్య తొలి పోరు!
- డబ్ల్యూపీఎల్ లో తలపడనున్న ఐదు జట్లు
- మొత్తం 21 మ్యాచ్ లు..
- అన్నీ ముంబై వేదికగానే నిర్వహణ
- ఈ నెల 26న ఫైనల్
మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. మనదేశంలో తొలిసారిగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ రోజు తొలి మ్యాచ్ జరగనుంది.
డబ్ల్యూపీఎల్ లో మొత్తం ఐదు జట్లు తలపడనున్నాయి. ఈ లీగ్ తొలి సీజన్‌కు ముంబై వేదిక కానుంది. అంటే అన్ని మ్యాచ్ లు ఇక్కడే జరగనున్నాయి. ఈ లీగ్‌లో మొత్తం 21 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ నెల 26న ఫైనల్ జరగనుంది.
తొలి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడనున్నాయి. గుజరాత్ జెయింట్స్ జట్టుకు బెత్ మూనీ (ఆస్ట్రేలియా), ముంబై ఇండియన్స్ టీమ్ కు హర్మన్ ప్రీత్ కౌర్ (ఇండియా) కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. తొలి మ్యాచ్ రాత్రి 7.30 నుంచి మొదలు కానుంది. అయితే అంతకుముందు సాయంత్రం 5.30 నుంచే ఆరంభ వేడుకలు జరుగుతాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పలువురు సినీతారలు పాల్గొననున్నారు.
15 ఏళ్ల కిందట మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్ లో అత్యంత ఆదరణ కలిగిన లీగ్ గా నిలిచింది. బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. ఇదే సమయంలో ఎందరో యువ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది. మహిళల లీగ్ ముగిసిన 4 రోజుల్లోనే పురుషుల లీగ్ ప్రారంభం కానుంది. మార్చి 31 నుంచి మే 28 దాకా రెండు నెలలపాటు కొనసాగనుంది.