Jasprit Bumrah: బుమ్రా విషయం మర్చిపోండి.. మాజీ ఆల్‌రౌండర్ మదన్‌లాల్ సంచలన వ్యాఖ్యలు
- డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఉమేశ్ యాదవ్‌ను తీసుకోవాలన్న మదన్ లాల్
- బుమ్రా జట్టులోకి వచ్చినా మునుపటి బుమ్రాను చూస్తామన్న గ్యారెంటీ లేదన్న మాజీ ఆల్‌రౌండర్
- సమీకరణాల నుంచి బుమ్రాను తప్పించాలని సూచన
టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాపై 1983 ప్రపంచకప్ హీరో మదన్‌లాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతానికైతే బుమ్రాను మర్చిపోవాలని, సమీకరణాల నుంచి అతడిని తప్పించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. భారత జట్టు కనుక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరుకుంటే బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను తీసుకోవాలన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్టులో భారత జట్టు కనుక విజయం సాధిస్తే ఇంగ్లండ్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రోహిత్ సేన అర్హత సాధిస్తుంది.
త్వరలోనే న్యూజిలాండ్‌కు..
గాయం కారణంగా 29 ఏళ్ల బుమ్రా ఆరు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. జూన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మాత్రమే కాదు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2023)కి కూడా దూరం కానున్నాడు. అక్టోబరులో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడే విషయంలోనూ అనుమానాలున్నాయి. వెన్నుకు సర్జరీ కోసం బుమ్రా మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్ వెళ్తాడని కూడా సమాచారం.
ముగ్గురు పేసర్లతో బరిలోకి..
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఉమేశ్ యాదవ్‌ను తీసుకోవచ్చన్న మదన్‌లాల్.. ముగ్గురు పేసర్లు, ఒకే స్పిన్నర్‌తో బరిలోకి దిగాలని, మిగతావారు ఫాస్ట్ బౌలర్లు ఉంటారని అన్నాడు. బుమ్రా విషయాన్ని ఇప్పటికైతే మర్చిపోవాలని, సమీకరణాల నుంచి అతడిని పక్కనపెట్టాలని సూచించాడు. బుమ్రా తిరిగి జట్టులోకి వస్తే అప్పుడు చూద్దామన్నాడు. ఇప్పుడున్న వనరులనే ఉపయోగించుకోవాలని పేర్కొన్నాడు.
బుమ్రా ఏడాది, ఏడాదిన్నర తర్వాత జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నాడు. అతడు ఆడి చాలా కాలమైందని, అంటే దానర్థం అతడి గాయం తీవ్రమైనదని చెప్పుకొచ్చాడు. బుమ్రా ఆడి ఆరు నెలలు అయిందని, ఇప్పుడు జట్టులోకి వచ్చినా మునుపటి బుమ్రాను చూస్తామని గ్యారెంటీ లేదని మదన్‌లాల్ పేర్కొన్నాడు.