Elon Musk: రెండు రోజుల్లోనే ప్రపంచ సంపన్న పీఠాన్ని చేజార్చుకున్న మస్క్
- ఐదు శాతం నష్టపోయిన టెస్లా షేర్లు
- ఒక్క రోజులోనే 1.91 బిలియన్ డాలర్ల మస్క్ సంపద ఆవిరి
- తిరిగి అగ్రస్థానానికి ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా టాప్ ర్యాంక్ అందుకున్న 48 గంట్లలోనే టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆ స్థానాన్ని కోల్పోయారు. ఈ వారం ప్రారంభంలో ప్రపంచ సంపన్నుల జాబితాలో మస్క్ మొదటి స్థానాన్ని తిరిగి పొందారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన నికర విలువ 187.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కానీ, బుధవారం టెస్లా షేర్లు 5 శాతం కంటే ఎక్కువ పడిపోయాయని ఫార్చ్యూన్ నివేదించింది. దీని వల్ల మస్క్ నికర ఆదాయం దాదాపు 2 బిలియన్లు పడిపోయింది. దాంతో, లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ అయిన ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
మస్క్ సంపద ఒక్కరోజులోనే 1.91 బిలియన్లు తగ్గి 184 బిలియన్లకు చేరుకుంది. అదే సమయంలో ఆర్నాల్ట్ 186 బిలియన్ డాలర్ల సంపదతో ముందుకెళ్లారు. దాంతో ప్రపంచ సంపన్నుడిగా మస్క్ రెండు రోజుల కిందట ఆక్రమించిన స్థానాన్ని ఆర్నాల్ట్ తిరిగి సొంతం చేసుకున్నారు. కాగా, వివిధ కారణాల వల్ల 2022లో టెస్లా షేర్ ధర 65 శాతం పడిపోయిన తర్వాత ఆర్నాల్ట్ గత డిసెంబర్ లో మస్క్ ను రెండో స్థానానికి నెట్టి ప్రపంచ సంపన్నుడిగా మారారు.