Rajnath Singh: భారత్‌ను జోడించేందుకు రాహుల్ కరాచీ వెళ్తారనుకున్నా: రాజ్‌నాథ్‌సింగ్ వ్యంగ్యాస్త్రాలు
- కర్ణాటకలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర
- సైనికుల ధైర్య సాహసాలను ప్రశ్నించారంటూ రాహుల్‌పై రాజ్‌నాథ్ ఫైర్
- వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరిన రక్షణ మంత్రి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్రను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలోని బెళగావి జిల్లా నందగఢ్‌లో బీజేపీ నిన్న నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర రెండో రోజు రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947లో భారత్ విడిపోయిందని, భారత్‌ను తిరిగి జోడించేందుకు రాహుల్ గాంధీ కరాచీ కానీ, లాహోర్ కానీ వెళ్తారని ఊహించానని, కానీ ఆయన ఎక్కడికీ వెళ్లలేదని ఎద్దేవా చేశారు.
దేశం మొత్తం ఐక్యంగా ఉన్నప్పుడు ఎవరిని ఉద్దేశించి రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారని ప్రశ్నించారు. ప్రజలను ఎంతోకాలం ఫూల్స్ చేయలేరన్నారు. రక్షణ శాఖ మంత్రిగా సైనికుల ధైర్యసాహసాలకు ఎంతో గర్విస్తున్నానన్న మంత్రి.. సైనికుల ధైర్య సాహసాలపై ప్రశ్నలు సంధించారంటూ రాహుల్‌పై విరుచుకుపడ్డారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో నాలుగు మూలల నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం చామరాజనగర జిల్లాలో ప్రారంభించారు.