Cherla: చర్ల కేజీబీవీ విద్యార్థినులకు అస్వస్థత.. ఫుడ్ పాయిజన్ కాదంటున్న వైద్యులు!
- ఓ విద్యార్థిని పరిస్థితి విషమం
- భద్రాచలం తరలించాలని కలెక్టర్ ఆదేశం
- ప్రయోగ పరీక్షల ఒత్తిడి కారణం కావొచ్చంటున్న ఎస్‌వో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఇంటర్ చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు.. వై. అంజలి, ఆదేశ, బి. హర్షిత, ఎం. నందిని, కె.పూజిత, కారం కృష్ణ లహరి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వీరిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో లహరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం విద్యార్థినులకు చికిత్స కొనసాగుతోంది. వీరి అస్వస్థతకు ఫుడ్ పాయిజన్ కారణం కాదని, రక్తహీనత వల్ల ఇలా జరిగి ఉంటుందని వైద్యులు తెలిపారు. కోలుకున్న ఐదుగురిని డిశ్చార్చ్ చేయగా, లహరిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.
కాగా, ఆరుగురు విద్యార్థినులు ఒకేసారి అస్వస్థతకు గురికావడంతో ఫుడ్‌పాయిజన్ అయి ఉంటుందని వారి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అస్వస్థతకు గురైన విద్యార్థినులు ఇంటి నుంచి వచ్చారని, ప్రయోగ పరీక్షల నేపథ్యంలో ఒత్తిడికి గురై ఉంటారని ఎస్‌వో సరోజిని పేర్కొన్నారు.