Pawan Kalyan: విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు... రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes AP Govt ahead of Global Investors Summit

  • విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు
  • మార్చి 3, 4 తేదీల్లో సదస్సు నిర్వహణ
  • రాజకీయం కంటే రాష్ట్రం మిన్న అంటూ పవన్ వ్యాఖ్యలు
  • ఈ రెండ్రోజులు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయబోమని వెల్లడి

విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరగనుండగా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. 

దేశ విదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోందని వెల్లడించారు. "మా శక్తిమంతమైన, అనుభవం కలిగిన ఏపీ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను. ఈ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్, మన యువతకు ఉపాధి లభించే అవకాశం కల్పించడంతో పాటు, పారిశ్రామికవేత్తలు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నా. 

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక విన్నపం... ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తిమంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి అంశాలను పెట్టుబడిదారులకు పూర్తిగా వివరించండి. రివర్స్ టెండరింగ్, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి. 

ఈ సదస్సు ఉద్దేశాలను కేవలం విశాఖకు మాత్రమే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప వంటి ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న అభివృద్ధికి గల అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా, ఏపీ మొత్తానికి నిజమైన పెట్టుబడిదారుల సదస్సుగా మార్చండి. 

ఇక చివరగా... రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్ విషయంలో ప్రభుత్వంపై ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు అందిస్తుంది. పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా జనసేన పార్టీ ఏపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న" అంటూ పవన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

More Telugu News