Nara Lokesh: పబ్జీ తప్ప జగన్ కు మరే ఆట తెలియదంటూ లోకేశ్ ఎద్దేవా.. ఈనాటి పాదయాత్ర హైలైట్స్

Nara Lokesh pada yatra highlights

  • 400 కిలోమీటర్లను పూర్తి చేసుకున్న లోకేశ్ పాదయాత్ర
  • పాదయాత్రపై ఇప్పటి వరకు 12 కేసుల నమోదు
  • పూర్తి స్థాయి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని లోకేశ్ హామీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 31వ రోజును పూర్తి చేసుకుంది. ఈరోజు ఆయన పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగింది. నేండ్రగుంట వద్ద పాదయాత్ర 400 కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఆధునిక వసతులతో 10 పడకల ఆసుపత్రికి ఆయన శిలాఫలకం వేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓ-1 ద్వారా తన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం యత్నిస్తున్నా... ప్రజల ఆశీస్సులతో 400 కి.మీ దూరాన్ని పూర్తి చేశానని చెప్పారు. 4 వేల కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యేంత వరకు తాను విశ్రమించబోనని అన్నారు. మరోవైపు ఇప్పటి వరకు 10 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఇప్పటి వరకు పాదయాత్రపై పోలీసులు 12 కేసులు నమోదు చేశారు. అంటే సగటున ప్రతి 33 కిలోమీటర్లకు ఒక కేసు నమోదయింది. 

ఇరంగారిపల్లిలో యువతతో లోకేశ్ ముఖాముఖి భేటీ అయ్యారు. పాకాల హైస్కూలు గ్రౌండ్ లో విద్యార్థులతో కాసేపు వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా తమకు డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని లోకేశ్ కు విద్యార్థులు వినతి పత్రం అందించారు. పాకాల మార్కెట్ వద్ద స్టూలుపై నిలబడి చిరువ్యాపారులతో మాట్లాడారు. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తాయని గుర్తు చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే యువత శుభవార్త వింటారని చెప్పారు. 

యువతలో నైపుణ్యాన్ని పెంచే విధంగా సిలబస్ లో మార్పులు తెస్తామని లోకేశ్ తెలిపారు. 2025 జనవరిలో పూర్తిస్థాయి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసి ఛార్జీలు, పెట్రోలు, డీజిల్, నిత్యవర వస్తువుల ధరలన్నీ తగ్గిస్తామని చెప్పారు. జగన్ ఇప్పటికే రూ. 10 లక్షల కోట్లు అప్పు చేశాడని అన్నారు. వచ్చే సంవత్సరంలో మరో రూ. 2 లక్షల కోట్లు అప్పు చేస్తాడని చెప్పారు. మన రాష్ట్రంలో ప్రతి నెల రూ. 20 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల వడ్డీ భారం పడుతోందని విమర్శించారు. ఈరోజు తెలంగాణకు వస్తున్న ఆదాయంలో 80 శాతం చంద్రబాబు తీసుకొచ్చిన పెట్టుబడుల పుణ్యమేనని చెప్పారు. 


'జగన్ రెడ్డికి పబ్జీ ఆడుకోవడం తప్ప...వేరే ఆటలపై అవగాహనే లేదు. చంద్రబాబు పాలనలో గోపీచంద్, పీవీ సింధును ప్రోత్సహించారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్లు చరిత్ర సృష్టించారు. చిత్తూరును స్పోర్ట్స్ హబ్ గా చేయాలని చంద్రబాబు సంకల్పించారు. మనం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే తిరుపతికి స్పోర్ట్స్ యూనివర్శిటీని తీసుకొస్తాం. ఒలింపిక్స్ లో తెలుగుజాతి బిడ్డలు పతకాలు సాధించాలనేది చంద్రబాబు సంకల్పం. తాజాగా నేషనల్ స్థాయిలో ఆడేందుకు వెళ్లే క్రీడాకారులకు జగన్ రెడ్డి ప్రభుత్వం కిట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో నా దగ్గరకు వచ్చారు' అని లోకేశ్ అన్నారు. 

Nara Lokesh
Telugudesam
Yuva Galam Padayatra
Jagan
YSRCP
  • Loading...

More Telugu News