Vijayapriya Nityananda: ఐక్యరాజ్యసమితిలో నిత్యానంద 'కైలాస దేశం' ప్రతినిధి విజయప్రియ నిత్యానంద.. ఆమె గురించి ఆసక్తికర వివరాలు!
- ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన విజయప్రియ
- తొలి ప్రసంగంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన కైలాస దేశం ప్రతినిధి
- ఆమె ఎవరో తెగ వెతికేస్తున్న నెటిజన్లు
ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఎవరూ ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి కైలాస దేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ దేశం ఒక పెద్ద జోక్ అంటూ అందరూ చాలా లైట్ గా తీసుకున్నారు. కానీ, ఈరోజు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు కైలాస దేశం ప్రతినిధులు కూడా హాజరయ్యారు. పూర్తిగా హిందుత్వం ఉట్టిపడేలా నుదిటిన పెద్ద బొట్టు, దుస్తులు, వింతగా ఉన్న తలపాగా, భారీ ఆభరణాలను ధరించి ఒక మహిళ ఐరాసలో ప్రసంగించారు. ఇది చూసిన వాళ్లంతా షాక్ కు గురయ్యారు. ఆమె ఎవరు? అంటూ నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఆమె పేరు విజయప్రియ నిత్యానంద. విజయప్రియ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం... ఆమె కెనడాలోని మనిటోబా యూనివర్శిటీ నుంచి మైక్రోబయాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. మెరుగైన విద్యార్థిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. కాలేజీలో ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు డీన్ ఆనర్ జాబితాలో ఆమె పేరును కూడా చేర్చారు. 2013, 2014 సంవత్సరాల్లో ఆమె ఇంటర్నేషనల్ యూజీ స్టూడెంట్ స్కాలర్ షిప్ ను సాధించారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, పెజిన్స్, క్రియోల్ భాషలను ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. అయితే ఆమె ఏ దేశానికి చెందినవారనే అంశంలో మాత్రం స్పష్టత లేదు.
ఆమె ప్రసంగాన్ని ఐక్యరాజ్యసమితి తన వెబ్ సైట్లో పోస్ట్ చేసింది. తన ప్రసంగంలో భారత్ పై విజయప్రియ నిత్యానంద తీవ్ర ఆరోపణలు చేశారు. హిందువుల కోసం ఏర్పాటైన తొలి సార్వభౌమ దేశం కైలాస దేశమని ఆమె తెలిపారు. ఈ దేశాన్ని ఏర్పాటు చేసిన నిత్యానంద హిందూ సంప్రదాయాలను, నాగరికతను పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. నిత్యానందను భారత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఈక్వెడార్ తీరానికి దగ్గర్లో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసిన నిత్యానంద దాన్ని కైలాస దేశంగా ప్రకటించారు. అయితే, కైలాస దేశాన్ని ఐక్యరాజ్యసమితి అధకారికంగా గుర్తించిందా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.