costly schools: ఈ స్కూలులో ఫీజు ఏడాదికి రూ.1.34 కోట్లు మాత్రమే! స్విట్జర్లాండ్ స్కూలులో ఫీజు ప్రపంచంలోనే ఎక్కువ
- స్విట్జర్లాండ్ లోని బ్యూ సోలీల్ ఆల్ఫైన్ కాలేజీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూలు
- యూకేలోని ‘హర్ట్ వుడ్’ ఫీజులు కూడా ఖరీదెక్కువే
- అమెరికా స్కూలులో ఏడాదికి రూ.77 లక్షలు చెల్లించాలి
- ఓ మోస్తరు సంపన్నులు కూడా అదిరిపడేలా ఫీజులు
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల గురించి వింటుంటే మధ్యతరగతి కుటుంబాలలో ఆందోళన కనిపిస్తుంటుంది. అంతలేసి ఫీజులు ఎలా కట్టాలనే టెన్షన్ తో సదరు స్కూళ్లలో పిల్లలను చేర్పించేందుకు వెనకాడుతుంటారు. ఓ మోస్తరు ఉన్నత వర్గానికి చెందిన వారికి ఈ ఫీజుల టెన్షన్లు ఉండవు. అయితే, అలాంటి వారు కూడా టెన్షన్ పడే రేంజ్ లో ఫీజులు వసూలు చేసే స్కూళ్లు ఉన్నాయి. ఏటా ఫీజు కింద రూ.కోట్లలో వసూలు చేసే స్కూళ్లు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. మరీ పాఠశాల విద్యకు రూ.కోటి ఫీజు ఏంటని అనుకుంటున్నారా.. అయితే, ఈ స్కూళ్ల వివరాలు తెలుసుకోవాల్సిందే!
స్విట్జర్లాండ్ లోని బ్యూ సోలీల్ ఆల్ఫైన్ కాలేజీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూలు.. ఇందులో సుమారు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ స్కూలులో తమ పిల్లలకు సీటు కోసం 50 దేశాలకు చెందిన సంపన్నులు ప్రయత్నిస్తుంటారు. ఫీజు విషయానికి వస్తే.. ఏడాదికి 1.50 లక్షల స్విస్ ఫ్రాంక్స్. మన రూపాయల్లో చెప్పాలంటే రూ.1.34 కోట్లు.. అక్షరాలా కోటీ ముప్పై నాలుగు లక్షల రూపాయలు మాత్రమేనట.
స్విట్జర్లాండ్ లోనే ఉన్న అత్యంత ఖరీదైన మరో స్కూలు లే రోసీ ఇన్‌స్టిట్యూట్. 65 దేశాలలోని సంపన్న కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు ఈ స్కూలులో తమ పిల్లలను చదివించాలని చూస్తుంటారు. సీటు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఈ స్కూలులో సుమారు 430 మంది విద్యార్థులు ఏటా రూ.1.1 కోట్లు చెల్లించి చదువు కొంటున్నారు.
యునైటెడ్ కింగ్ డమ్ లోని హర్ట్‌వుడ్ హౌస్ స్కూల్ కూడా అత్యంత ఖరీదైన స్కూళ్ల జాబితాకు చెందినదే. ఇందులో చదవాలంటే భారీ మొత్తం ఫీజుగా చెల్లించాలి. అలాగని డబ్బుకు కొదవేలేని కుటుంబాలకు చెందిన పిల్లలు అందరికీ ఇందులో సీటు దొరకదు. ముందుగా ఇంటర్వ్యూ పెట్టి, విద్యార్థి ప్రతిభను అంచనా వేస్తారు. తమ స్కూలు ప్రమాణాలకు సరిపోతారని నమ్మకం కలిగితేనే అడ్మిషన్ ఇస్తారు. ఇక ఈ స్కూలు ఫీజు ఏడాదికి రూ.25 లక్షలు మాత్రమే.
ఖరీదైన స్కూళ్ల జాబితాలోని మరో స్కూలు పేరు.. థింక్ గ్లోబల్ స్కూలు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉందీ పాఠశాల. ఇందులో చేరిన విద్యార్థులు నాలుగు దేశాలు తిరిగి, ఆయా దేశాల్లో విద్యాభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఈ స్కూల్ లో అడ్మిషన్ పొందిన విద్యార్థి నుంచి ఫీజు రూపంలో ఏటా రూ.77 లక్షలను యాజమాన్యం వసూలు చేస్తుంది.