Isle of Man: టీ20లో అత్యంత చెత్త రికార్డు.. 10 పరుగులకే ఓ జట్టు ఆలౌట్.. రెండు బంతులకే మరో జట్టు విజయం!

Isle of Man records the lowest ever T20 score of 10 against Spain

  • ఐల్ ఆఫ్ మ్యాన్-స్పెయిన్ మధ్య మ్యాచ్‌లో ఘటన
  • 8.4 ఓవర్లలో 10 పరుగులకే ఆలౌట్
  • జట్టులో ఏడుగురు ఆటగాళ్లు డకౌట్
  • నాలుగు పరుగులతో టాప్ స్కోరర్‌గా జోసెఫ్ బరోస్

పరుగుల వర్షం కురిసే టీ20 క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఓ జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌట్ కాగా, మరో జట్టు రెండంటే రెండు బంతుల్లోనే విజయం సాధించింది. ‘ఐల్ ఆఫ్ మ్యాన్’-‘స్పెయిన్’ జట్ల మధ్య కార్గజెనాలోని లా మంగా క్లబ్ బోటమ్ గ్రౌండ్‌లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డు నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు 8.4 ఓవర్లలో 10 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరారు. మరో ముగ్గురు ఆటగాళ్లు చెరో రెండు పరుగులు చేయగా, జోసెఫ్ బరోస్ 4 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

స్పెయిన్ లెఫ్టార్మ్ బౌలర్లు అతిఫ్ మెహమూద్, మహమ్మద్ కమ్రాన్ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు. కమ్రాన్ ఖాతాలో ఓ హ్యాట్రిక్ కూడా వచ్చి చేరింది. అనంతరం 11 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్పెయిన్ తొలి రెండు బంతుల్లోనే రికార్డు విజయం సాధించింది. ఓపెనర్ అవైస్ అహ్మద్ రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. 

ఐల్ మ్యాన్ జట్టు చేసిన 10 పరుగులు టీ20 ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్పం. ఇప్పటి వరకు ఈ రికార్డు సిడ్నీ థండర్ పేరున ఉండేది. 2022-23 సీజన్ బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్టైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ జట్టు 15 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడా రికార్డును ఐల్ ఆఫ్ మ్యాన్ బద్దలుగొట్టింది. 

కాగా, ఇప్పటి వరకు 16 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు 8 మ్యాచుల్లో గెలిచి ఓ మ్యాచ్‌లో ఓడింది. మరో దాంట్లో ఫలితం తేలలేదు. ఇక, స్పెయిన్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐల్ ఆఫ్ మ్యాన్ 0-5తో పరాజయం పాలైంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.

More Telugu News