Singireddy Niranjan Reddy: చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy said he condemns Chandrababu comments

  • తెలంగాణలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభం
  • చంద్రబాబు ప్రసంగం పట్ల మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం
  • తెలంగాణలో 11వ శతాబ్దం నాటికే వరి పండించారని వెల్లడి
  • చంద్రబాబుది అవగాహనారాహిత్యం అని వ్యాఖ్యలు
  • తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్

తెలంగాణలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం పట్ల మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వచ్చాకే తెలంగాణ ప్రజలకు వరి అన్నం తెలిసిందని చంద్రబాబు అనడం సరికాదని, చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. 

తెలంగాణ 11వ శతాబ్దం నాటికే వరి పండించిందని, హైదరాబాదు నగరం 15వ శతాబ్దం నాటికే దమ్ బిర్యానీకి ప్రసిద్ధి చెందిందని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులు నిర్మించారని... ఆ నీటిపారుదల కింద వరి, గోధుమలు, కొర్రలు, పెసలు, అల్లం, చెరుకు, ఉల్లి, జొన్నలు, పసుపు పంటలు పండించారని వివరించారు. 

చంద్రబాబు ఇవన్నీ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

చంద్రబాబుది అవగాహనరాహిత్యమే కాకుండా, అహంకారంతో కూడిన ధోరణి అని విమర్శించారు. చరిత్ర తెలియని వారు ఈ ప్రాంత ముఖ్యమంత్రులుగా పనిచేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News