donkey: గాడిదలకు సీమంతం.. ఎక్కడంటే..?

halari donkey gets baby shower in gujarat

  • అంతరించిపోయే జాబితాలో హలరీ జాతి గాడిదలు 
  • వాటిని సంరక్షించేందుకు కృషి చేస్తున్న గుజరాత్ లోని రాజ్ కోట్ ప్రజలు
  • గాడిదలకు సీమంతాలు, పిల్లలకు బారసాలలు కూడా..

గాడిదలకు సీమంతం చేయడం ఎక్కడైనా చూశారా? గాడిద పిల్లలకు బారసాల నిర్వహించడం గురించి ఎప్పుడైనా విన్నారా? అలా కూడా చేస్తారా? అని ఆశ్చర్యపోకండి. చేస్తున్నారు!! అయితే అందుకో కారణం ఉంది.

హలరీ జాతి గాడిదలు అంతరించిపోయే జాబితాలో ఉన్నాయట. దీంతో వాటిని కాపాడుకునేందుకు గుజరాత్ లోని రాజ్ కోట్ ప్రజలు కృషి చేస్తున్నారు. వీటి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. అందుకే పిల్లలు పుట్టినప్పుడు ఎలా శుభకార్యాలు చేస్తారో.. అప్పుడే పుట్టిన గాడిద పిల్లలకు అలానే చేస్తున్నారు. బారసాల నిర్వహిస్తున్నారు. గర్భం దాల్చిన వాటికి సీమంతం చేస్తున్నారు.

కొన్ని రోజుల కిందట ఉప్లేటా తాలూకాలోని కోల్కి అనే గ్రామంలో హలరీ జాతి గాడిద ఈనింది. దీంతో గ్రామవాసులు సంబరాలు చేసుకున్నారు. పశువుల కాపరులు, ఇతరులు కలిసి బారసాల చేశారు. గర్భం దాల్చిన మరో 33 గాడిదలకు సీమంతం కూడా చేశారు. నుదుటిన తిలకం దిద్ది, వస్త్రాలు కప్పారు. మహిళలు పూజలు చేసి, ఆహారం పెట్టారు. 

ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా వచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు మిఠాయిలు పంచుకున్నారు. ప్రస్తుతం హలరీ జాతి గాడిదలు 417 మాత్రమే ఉన్నాయట.

More Telugu News