Team India: నా వల్లే భారత్ ఓడటంతో నెల రోజులు ఏడ్చాను: ఇషాంత్ శర్మ
- 2013లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్న బౌలర్
- మొహాలీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో పేలవ ప్రదర్శన చేసిన ఇషాంత్
- ఓటమి బాధతో కుంగిపోయిన తనకు ధోనీ, ధవన్ ధైర్యం చెప్పారని వెల్లడి
టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ సత్తా ఏంటో అందరికీ తెలిసిందే. అన్ని ఫార్మాట్లలోనూ మెప్పించిన ఇషాంత్ ఎన్నో మ్యాచ్ ల్లో భారత్ ను గెలిపించాడు. క్రికెటర్ అన్నాక కెరీర్లో ఎత్తు పల్లాలు సహజం. 2013లో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు ఇషాంత్ నిరాశ పరిచాడు. మొహాలీలో ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో అతని పేలవ బౌలింగ్ కారణంగా భారత్ ఓడిపోయింది. తన వల్లే భారత్ ఓడిపోయిందని అతను తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. దాదాపు నెల రోజుల పాటు ఆ ఓటమి బాధను మర్చిపోలేక ఏడుస్తూనే ఉన్నానని ఇషాంత్ తెలిపాడు. ఈ సమయంలో ధోనీ, శిఖర్ ధవన్ తనకు సాయం చేశారని చెప్పాడు. పదేళ్ల కిందట జరిగిన ఈ విషయాన్ని ఇషాంత్ తాజాగా గుర్తు చేసుకున్నాడు.
‘నా కెరీర్ లో అత్యల్ప క్షణం ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన 2013 మ్యాచ్. అంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో నేను తీవ్రంగా కలత చెందా. జట్టు ఓడిపోవడానికి నేనే కారణం కావడంతో నాకు నిద్ర పట్టలేదు. ఆ సమయంలో నేను నా భార్యతో డేటింగ్ చేస్తున్నాను. ఈ విషయం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాదాపు ఒక నెల పాటు నేను ప్రతిరోజూ ఆమెకు కాల్ చేసి నా వల్ల జట్టు ఓడిపోయిందని ఫోన్‌లో ఏడ్చేవాడిని. విషయం తెలుసుకున్న ధోనీ, ధవన్ నా గదికి వచ్చారు. నువ్వు బాగా ఆడుతున్నావు అంటూ నాలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. కానీ, ఆ ఒక్క మ్యాచ్ కారణంగా నేను వైట్ బాల్ (వన్డే, టీ20 ఫార్మాట్) బౌలర్‌ని కాను అనే అభిప్రాయం ఏర్పడింది’ అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇషాంత్ భారత జట్టుకు దూరమై చాలా కాలం అవుతోంది. చివరగా 2021లో టెస్టు మ్యాచ్ ఆడాడు.