KTR: సిసోడియా అరెస్ట్ ను ఖండించిన కేటీఆర్

KTR condemns Manish Sisodias arrest

  • బీజేపీవి నీచ రాజకీయాలన్న కేటీఆర్
  • విపక్ష నేతలపై అవినీతి ముద్ర వేస్తోందని మండిపాటు
  • బీజేపీని ప్రజలు ఇంటికి సాగనంపుతారని వ్యాఖ్య

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాసేపట్లో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు సిసోడియా అరెస్ట్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖండించారు. సిసోడియా అరెస్ట్ అప్రజాస్వామికమని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విపక్షాలపై ప్రభుత్వ ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం ఉసిగొల్పుతోందని, నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. 

ప్రజాబలం లేని రాష్ట్రాల్లో, అధికారంలోకి రాలేని రాష్ట్రాల్లో అక్కడి పార్టీలను బలహీనపరిచే కార్యక్రమాలను చేస్తోందని అన్నారు. ఇందులో భాగమే సిసోడియాను అరెస్ట్ చేయడమని చెప్పారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేక సిసోడియాను అరెస్ట్ చేశారని తెలిపారు. 

బీజేపీ అవినీతిని, అసమర్థ రాజకీయాలను ప్రశ్నిస్తున్న బలమైన నేతలను దెబ్బతీసేందుకు పిరికి రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను అవినీతిపరులుగా చూపించేందుకు యత్నిస్తోందని... బీజేపీలోని అవినీతి నేతలను మాత్రం సత్యహరిశ్చంద్రుల్లా చూపిస్తోందని దుయ్యబట్టారు. కుట్ర రాజకీయాలు చేస్తున్న బీజేపీని ప్రజలు ఇంటికి సాగనంపుతారని చెప్పారు. రాబోయే రోజుల్లో బీజేపీ నేతలు కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటారని అన్నారు.

KTR
BRS
Manish Sisodia
AAP
  • Loading...

More Telugu News