Anand Mahindra: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రోడ్డు.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో
- హాఫ్ రౌండ్ వేయడం ద్వారా సాగిపోయే వాహనాలు
- ఇది అధిక ఇంధనానికి దారితీస్తుందా? అంటూ ఆనంద్ మహీంద్రా ప్రశ్న
- 2016లో యెమెన్ ఇంజనీర్ రూపొందించిన డిజైన్
రహదారులపై ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నవే లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి? చాలా హాయిగా అనిపిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఓ అద్భుతమైన రోడ్డు డిజైన్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేశారు. వాహనాలు అసలు ఆగాల్సిన పనే లేకుండా సాగిపోవడాన్ని అందులో గమనించొచ్చు.
ఆనంద్ మహీంద్రా తరచూ ఇలాంటి పోస్ట్ లతో యూజర్ల ముందుకు వస్తుండడం తెలిసిందే. హైదరాబాద్ లో మెట్రో వచ్చిన తర్వాత చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ తొలగించారు. దీనికి బదులు యూటర్న్ ల విధానం ప్రవేశపెట్టారు. కానీ, ఇదేమంత సక్సెస్ ఫుల్ విధానం అయితే కాదు. ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ట్రాఫిక్ జాప్యానికీ చోటు ఉంటుంది. కానీ, ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఉన్నది విభిన్నమైన సిగ్నళ్లు లేని విధానం.
‘‘అద్భుతం. యెమెన్ ఇంజనీర్ మహమ్మద్ అవాస్ రూపొందించిన (2016లో) డిజైన్ ఇది. ట్రాఫిక్ లైట్లు లేకుండా సగం చుట్టూ తిరిగి వెళ్లడం ద్వారా నిరంతరం ట్రాఫిక్ ను నియంత్రిస్తుంటుంది. కానీ, ఇది అధిక ఇంధనం వినియోగానికి దారితీస్తుందా? అని ఆనంద్ మహీంద్రా తన పోస్ట్ లో ప్రశ్నించారు.