India: అదానీ దెబ్బతో అత్యల్ప స్థాయికి పడుతున్న ఎల్ఐసీ షేరు విలువ
- అదానీకి చెందిన ఏడు గ్రూపుల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ
- హిండెన్ బర్గ్ నివేదికతో కుప్పకూలుతున్న అదానీ సామ్రాజ్యం
- ఎల్ఐసీపైనా దాని ప్రభావం
అదానీ గ్రూప్ వ్యవహారాలపై హిండెన్ బర్గ్ నివేదిక భారత స్టాక్ మార్కెట్లను కుదేలు చేస్తూనే ఉంది. ఈ నివేదిక తర్వాత గౌతమ్ అదానీ లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఆ కంపెనీ షేర్లన్నీ పతనం అయ్యాయి. అదానీ గ్రూప్ లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ పెట్టుబడుల విలువను అమాంతం తగ్గించింది. అదానీ గ్రూప్‌పై ఏర్పడిన ప్రతికూల వాతావరణం మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆ కంపెనీల షేర్లు నెల రోజులుగా కుప్పకూలుతున్నాయి. ఆ సంస్థల షేర్లలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) పెట్టిన పెట్టుబడులూ అంతకంతకూ తరిగిపోతున్నాయి.
శుక్రవారం ఎల్ఐసీ షేర్లు ఒక శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. ఫలితంగా ఎల్ఐసీ స్టాక్ ధర రూ. 585కి చేరుకుంది. కంపెనీ షేరు ఆల్ టైమ్ అత్యల్ప ధర రూ.582కి సమీపిస్తోంది. అదానీ గ్రూప్‌లోని ఏడు కంపెనీల షేర్లలో ఎల్‌ఐసీ రూ.30,127 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన జనవరి 24వ తేదీ నాటికి ఎల్‌ఐసీ ఈ షేర్లలో రూ.51,141 కోట్ల లాభాల్లో ఉంది. కానీ, నెల రోజుల్లో ఆ లాభం రూ.3,022 కోట్లకు పడిపోయి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.