Nandyal: నంద్యాల జిల్లాలో పరువు హత్య.. కుమార్తెను హత్య చేసి తల, మొండెం వేరు చేసిన తండ్రి!

Honour Killing in Nandyal Distict Father killed Daughter
  • పాణ్యం మండలంలోని ఆలమూరులో ఘటన
  • రెండేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో ప్రసన్నకు వివాహం
  • పెళ్లికి ముందు మరో యువకుడిని ప్రేమించిన యువతి
  • ఇటీవల ఇంటికొచ్చి మళ్లీ భర్త వద్దకు వెళ్లని ప్రసన్న
  • పరువు పోయిందని గొంతు నులిమి చంపేసిన తండ్రి
పెళ్లికి ముందు మరో అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి.. పెళ్లి తర్వాత ఊరికొచ్చి మళ్లీ వెళ్లలేదు. కుమార్తె ప్రవర్తనతో ఊళ్లో తలెత్తుకోలేకపోతున్నానని భావించిన తండ్రి ఆమెను చంపేసి తల, మొండేన్ని వేరు చేశాడు. ఈ దారుణ ఘటన నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఆలమూరులో జరిగింది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దేవేంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్దమ్మాయి ప్రసన్న (21)కు రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో వివాహం జరిగింది. పెళ్లికి ముందు ప్రసన్న మరో యువకుడిని ప్రేమించేది. పెళ్లయ్యాక కూడా అతడిని మర్చిపోలేకపోయింది. ఈ క్రమంలో ఇటీవల గ్రామానికి వచ్చిన ప్రసన్న తిరిగి భర్త వద్దకు వెళ్లలేదు. కుమార్తె ప్రవర్తనతో తన పరువు పోయిందని ఆగ్రహంతో ఊగిపోయిన దేవేంద్రరెడ్డి ఈ నెల 10న కుమార్తెను గొంతు నులిమి చంపేశాడు. 

ఆ తర్వాత మరికొందరితో కలిసి కారులో కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లి నంద్యాల-గిద్దలూరు మార్గంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కుమార్తె మృతదేహం నుంచి తలను వేరు చేసి రెండింటిని వేర్వేరు చోట్ల పడేశారు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఇంటికొచ్చాడు. మరోవైపు, తరచూ ఫోన్ చేసి పలకరించే మనవరాలు ఫోన్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తాత శివారెడ్డి గట్టిగా నిలదీయడంతో దేవేంద్రరెడ్డి అసలు విషయం బయటపెట్టాడు. 

పరువు పోవడంతో తానే ఆమెను హత్య చేసినట్టు చెప్పాడు. దీంతో శివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం దేవేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రసన్న తల, మొండెం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Nandyal
Panyam
Alamur Village
Honour Killing

More Telugu News