alcohol: మీకు ఆల్కహాల్ సరిపడదు అని చెప్పేందుకు సంకేతాలు ఇవి..!

The side effects of alcohol on your body

  • కడుపుబ్బరం, గ్యాస్ తదితర జీర్ణ సంబంధిత సమస్యలు
  • పాంక్రియాటిక్ కేన్సర్ ముప్పు
  • పెరిగిపోయే రక్తపోటు, నరాల సమస్యలు

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.. ఈ సూచనను ఎవరూ పట్టించుకోరు. ఆల్కహాల్ చాలా మితంగా రోజుకు 30 ఎంఎల్ తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందని కొందరు చెబుతుంటారు. అయితే, చుక్క చాలు కేన్సర్ రిస్క్ తెచ్చిపెట్టడానికి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కనుక ఆల్కహాల్ ఎంత తాగినా, అది మంచిది కాదని తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు ఒకే విడత అధిక పరిమాణంలో మద్యం తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్కహాల్ మన శరీరానికి హాని చేస్తుందని చెప్పేందుకు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి. వాటిని చూసి అయినా మేల్కొనడం మంచిది.

జీర్ణాశయ సమస్యలు
మద్యపానం జీర్ణవ్యవస్థకు హాని చేస్తుంది. తీసుకున్న ఆహారాన్ని పేగులు జీర్ణం చేయనీయకుండా అడ్డు పడుతుంది. ఆహారంలో ఉన్న పోషకాలు, విటమిన్లను మన శరీరం గ్రహించలేదు. అధిక మోతాదులో తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, నీళ్ల విరేచనాలు తదితర సమస్యలు కనిపిస్తాయి. ఉదర సంబంధిత అల్సర్లకు దారితీస్తుంది.

రక్తపోటు
మద్యపానం గుండెకు మంచిది కాదు. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును పెంచేస్తుంది. రక్త నాళాల సంకోచానికి కారణమవుతుంది. ఒక్క సిట్టింగ్ లో మూడు డ్రింక్ లకు మించి తాగితే రక్తపోటు పెరిగిపోతుందని మయో క్లినిక్ చెబుతోంది. రోజువారీ తాగే అలవాటున్న వారు తిరిగి పూర్వపు స్థితికి చేరుకోలేని బీపీ బారిన పడతారు. 

కాలేయానికి నష్టం
తాగిన మద్యం ముందుగా పొట్టలోకి చేరుతుంది. అక్కడి నుంచి రక్తంలో చేరి, కాలేయానికి చేరుకుంటుంది. ఆల్కహాల్ ను బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎంజైమ్ లను కాలేయం విడుదల చేస్తుంది. అధిక మద్యం తీసుకోవడం, దీర్ఘకాలంగా మద్యపాన సేవనంతో దాని దుష్ప్రభావం కాలేయంపై పడుతుంది. ఫ్యాటీ లివర్ కు దారితీస్తుంది. కాలేయంలో కొవ్వు చేరుకునిపోవడమే ఫ్యాటీ లివర్. 

నరాల సమస్యలు
మెదడులో రసాయనాల పనితీరును ఆల్కహాల్ ప్రభావితం చేస్తుంది. ఏకాగ్రత, దృష్టి, మూడ్ (భావనలు) వీటికి మెదడు విడుదల చేసే రసాయనాలే కీలకం. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మెదడులోని కమ్యూనికేషన్ల మార్గాలను ప్రభావితం చేస్తుంది. మెదడు పనితీరుపైనా ప్రభావం చూపిస్తుంది. కాళ్లు, చేతులు వణకడం, మాట తడబడడం, కుదురుగా నిలబడలేకపోవడం వంటి నరాల సమస్యలకు కారణమవుతుంది.

పాంక్రియాటైటిస్ ముప్పు  
ఆల్కహాల్ ను అధికంగా తీసుకోవడం వల్ల పాంక్రియాస్ లో వాపునకు కారణమవుతుంది. దీన్నే పాంక్రియాటైటిస్ అంటారు. జీర్ణానికి అవసరమైన ఎంజైమ్ లను పాంక్రియాసిస్ విడుదల చేస్తుంది. ఇన్సులిన్ ను కూడా ఇదే ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలం పాటు పాంక్రియాస్ పై ఈ వాపు, ఒత్తిడి ప్రభావం పడితే అది పాంక్రియాటిక్ కేన్సర్ గా మారే ప్రమాదం లేకపోలేదు.

More Telugu News